భద్రాచలం, అక్టోబర్ 6: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడురోజులుగా ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. మూడోరోజు ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు శ్రీగజలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు అమ్మవారికి స్నపన తిరుమంజనం గావించి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో మహిళా భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేదపండితులు, అర్చకులు అయోధ్యకాండ పారాయణం చేశారు.
గజలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తే అధికారం, మహాసంపద కలుగుతాయని ప్రతీతి. గజలక్ష్మిని ఆరాధించే దేవేంద్రుడు త్రైలోకాధిపత్యాన్ని సాధించాడని, ఈ అమ్మను పూజిస్తే చెదరని అధికారం, తరగని సంపద కలుగుతాయని పండితులు ఉపదేశిస్తున్నారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి దేవస్థానంలోని శ్రీలక్ష్మీతాయారు అమ్మవారు సోమవారం ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.