మలి దశలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేసీఆర్ దీక్ష సమూలంగా మార్చి వేసింది. నాడు ఆమరణ దీక్షకు పూనుకున్న కేసీఆర్‌ను కరీంనగర్లో అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యమ ప్రభావం తక్కువగా ఉంటుందనుకొని నేరుగా ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఇక్కడ కూడా తొమ్మిదిరోజులపాటు కేసీఆర్ దీక్ష కొనసాగించడం, ఉద్యమకారులు భగ్గుమనడం, తెలంగాణ రావణ కాష్టం కావడం..
ఫలితంగా ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం’ ప్రకటనకు బీజం పడడం వంటివి తెలంగాణ ప్రజల గుండెల్లోనేగాక ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజల హృదయాల్లోనూ చెరగని చిహ్నాలు. ఖమ్మంలో కేసీఆర్ దీక్షకు సమాంతరంగా జరిగిన పోరాటాలు ఎన్నటికీ చెదిరిపోని సాక్ష్యాలు. వీటన్నింటినీ నెమరువేసుకునేందుకే తెలంగాణ ప్రజలు నేడు దీక్షా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
-ఖమ్మం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నవంబర్ 30న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన డాక్టర్లు.. ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ దీక్షను విరమించారని, ఆయన సూచన మేరకే పండ్ల రసం అందించామని ఏఎస్పీ పరిమళ ప్రకటిస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియో టేప్‌లను పత్రికలకు విడుదల చేశారు. దీంతో అందరూ నిర్ఘాంతపోయారు. అర్ధాంతరంగా దీక్షను విరమించడాన్ని సహించని ఓయూ విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దురుద్దేశపూర్వకంగా తన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు, అప్పటి పాలకులు డ్రామా చేశారని కేసీఆర్ ఆరోపించారు. తాను దీక్ష కొనసాగిస్తున్నట్లు విస్పష్టంగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు శాంతించారు. చల్లారి పోయిందనుకున్న అగ్గి మళ్లీ రాజుకొని నిప్పులగుండమై నింగినంటింది. ఉద్యమ స్వరూపాన్నే మార్చివేసింది.
ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపజేసింది. ఓ నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఆరు దశాబ్దాలు దోపిడీకి గురైన ప్రజానీకం ఒక్క గొంతుగా నిలిచింది. ఆత్మహత్యలు, బలిదానాల సాక్షిగా కొనసాగిన ఉద్యమంలో చావో రేవో తేల్చుకునేందుకు బరిగీసి నిలిచిన రోజు అది. ఒకరి దీక్ష నాలుగు కోట్లమంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది.
ఒక నాయకుడి ఆమరణ దీక్ష దేశ ప్రజలను కదిలించింది. విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ కలిసి ఒక్కటై అడుగులో అడుగువేశారు. ‘నా ఒక్కడి వల్ల దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడి వల్లా దేశానికి ప్రయోజనం లేదు’ అన్న క్యూబా దేశ మాజీ అధ్యక్షుడు, ప్రపంచ విప్లవకారుడు ఫిడెల్ కాస్ట్రో మాటలను ఆదర్శంగా తీసుకుని అహింసామార్గంలో ఉద్యమాన్ని నడిపిన మహానేత అతడు. అతడే.. తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్. ఆయన చేపట్టిన దీక్ష తెలంగాణ మలివిడత ఉద్యమంలో స్వరాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికింది. ఆయన చేపట్టిన ఆ దీక్షకు నేటితో (శుక్రవారం)తో పదిహేనేళ్లు పూర్తవుతోంది. ఆ చారిత్రక ఘట్టానికి ఖమ్మం వేదిక కావడమే అపూర్వం.
కేసీఆర్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చిన రోజు కోర్టుకు సెలవు. ఏ ఒక్క మెజిస్ట్రేట్ లేరు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీరామమూర్తి ఇంటి దగ్గర కేసీఆర్‌ను రిమాండ్ చేశారు. అప్పుడు నేను ‘జై తెలంగాణ’ అని నినాదాలు చేశాను. ఉద్యమంలో పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు.
-గుండ్లపల్లి శేషగిరిరావు, ఉద్యమకారుడు
అది 2009, నవంబర్ 29వ తేదీ. మెదక్ జిల్లా సిద్ధిపేట సమీపంలోని రంగదామ్పల్లిలో కేసీఆర్ ఆమరణ దీక్షకు వేదిక సిద్ధమైంది. కరీంనగర్ నుంచి వేదిక వద్దకు దాదాపు 159 వాహనాల భారీ కాన్వాయితో బయల్దేరి వెళ్లిన కేసీఆర్‌ను జిల్లా కేంద్రం పొలిమేర్లలోని అల్గునూర్ వద్ద వ్యూహాత్మకంగా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్ మీదుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలనుకున్నారు. చివరికి ఖమ్మం వైపు దారి మళ్లించారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఖమ్మంలోని చర్చికాంపౌండ్ ఏరియాలో నివాసముండే సెకండ్ క్లాస్ స్పెషల్ మెజిస్ట్రేట్ సీహెచ్ శ్రీరామమూర్తి ఇంటి ఎదుట కేసీఆర్‌ను తీసుకువస్తున్న కాన్వాయి ఆగింది. అప్పటికే కేసీఆర్‌ను అరెస్టు చేసి తీసుకువస్తున్నట్లు అప్పటి ఏఎస్పీ పరిమళ, ఎస్పీ కాంత్రిరాణా మెజిస్ట్రేట్‌కు సమాచారం అందించారు.
మెజిస్ట్రేట్ ఎదుట కేసీఆర్‌తోపాటు నాయిని నర్సింహారెడ్డి, విజయరామారావు, వరంగల్ ఎంపీ రాజయ్యలను హాజరుపరిచారు. కేసీఆర్ సహా 9 మందికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిపై అప్పటికే ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 114, 117, 120 (బీ), 143, 153 (ఏ), 188, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయనకు సలహా ఇచ్చేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ, కేసీఆర్ అంగీకరించకపోవడంతోపాటు నిరాహార దీక్షను జైలు నుంచే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదే రోజు 12:45 గంటలకు ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. అప్పటికే తెలంగాణలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. నవంబర్ 29న తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పిలుపునిచ్చింది. అదే రోజు న్యాయవాది సుగుణారావు నేతృత్వంలో ఇద్దరు న్యాయవాదులు కేసీఆర్‌ను కలుసుకొని మాట్లాడారు. బయటకు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఆయన పూర్తిగా బలహీనపడ్డట్టు తేల్చారు. సాయంత్రం ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ పాపాలాల్ ఆధ్వర్యంలో డాక్టర్లు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ధ్రువీకరించారు.
హెచ్ఆర్సీ నంబర్ 8944/2009 పేరిట డిసెంబర్ 2న మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) నుంచి కూడా అనేక మార్గదర్శకాలు వచ్చాయి. నిపుణులైన వైద్యులతో వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలని, కేసీఆర్ ఆరోగ్యంలో వస్తున్న మార్పుల పట్ల ప్రతి నిమిషం జాగ్రత్తలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వానికి హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. పోలీసులు ఆస్పత్రిలో ఉండి భయబ్రాంతులకు గురిచేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అని ప్రకటించింది. కానీ, ఈ మార్గదర్శకాలను అప్పటి పోలీసులు, పాలకులు ఏమాత్రం పాటించలేదు. వందలమంది పోలీసుల పహారాతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి నిండిపోయింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఖమ్మం జైలు నిర్బంధంలో, ప్రభుత్వాసుపత్రిలో కేసీఆర్ ఉన్నారు. అనంతరం మానవ హక్కుల సంఘం ఆదేశం మేరకు హైదరాబాద్‌కు ఆయనను తరలించారు.
కేసీఆర్‌ను ఖమ్మం జైల్లో నిర్బంధించిన వెంటనే న్యాయవాదులు స్పందించారు. జైల్లో మెరుగైన వైద్యం కల్పించాలని, ఒక పార్లమెంట్ సభ్యుడిని ‘సీ’ క్లాస్ జైల్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, కేసీఆర్ ‘క్రానిక్ డయాబెటిక్’ పేషంటని, 60 ఏళ్లు ఉంటాయని, ప్రత్యేక వైద్యులను తెప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. చర్లపల్లి (హైదరాబాద్) జైలుకు పంపించాలని దావా వేశారు. కానీ, ఆనాటి ప్రభుత్వం చాలా నియంతృత్వంగా వ్యవహరించింది.
కేవలం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యం చేయించింది. ఆధునిక వైద్య సౌకర్యాన్ని గానీ, ప్రత్యేక వైద్యులను గానీ కేటాయించలేదు. దీంతో ఆస్పత్రిలోనే కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగించారు. ఎలాంటి మందులనూ తీసుకోలేదు. ‘తెలంగాణ సాధనే నా లక్ష్యం’ అంటూ స్పష్టం చేశారు. ‘ఆస్పత్రిలో ఉంచినా, జైల్లో ఉంచినా బలవంతంగా నా చేత దీక్ష మాన్పించడం మీ తరం కాదు’ అంటూ నాటి సీమాంధ్ర పాలకులకు స్పష్టం చేశారు. జైల్లో ఉండి కూడా స్వయంగా తన దస్తూరితోనే మానవ హక్కుల చైర్మన్‌కు లేఖ రాశారు. ‘నాకు బెయిల్ ఇవ్వకండి’ అని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణ కోసం శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని బలవన్మరణం పొందాడని కేసీఆర్‌కు మొట్టమొదటిసారిగా చెప్పింది ఖమ్మం న్యాయవాది మేకల సుగుణారావే. కేసీఆర్ వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. ‘తెలంగాణకోసం ప్రాణాలు త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరెవరూ ప్రాణాలు తీసుకోవద్దు’ అంటూ కేసీఆర్ ప్రకటించారు. ‘తెలంగాణ భావితరాల కోసం, వారి జీవితాల్లో వెలుతురు నింపడం కోసం మీలాంటి వారు ఆత్మహత్యలు మానండి. మనోనిబ్బరంతో ఉద్యమంలో భాగస్వాములు కండి?’ అంటూ ఉద్యమసారథి పిలుపునిచ్చారు.
కేసీఆర్ అంటే నాకు ప్రాణం. ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానంతోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ప్రాణానికి ఎదురొడ్డి పోరాడాను. ప్రతి ఉద్యమంలో ముందుండి నడిచాను. ఆ రోజు ‘జై తెలంగాణ’ అనేందుకు ఇక్కడి ప్రజలు భయపడ్డారు. కానీ కేసీఆర్ ఉన్నాడనే ధైర్యంతోనే మేం ‘జై తెలంగాణ’ అని నినదించాం. చేతిలో గులాబీ జెండా ఉండడంతో భయపడలేదు. కేసీఆర్‌తో దీక్షలో పాల్గొన్నాను. ఆయనతోనే నడిచాను.
-ఉప్పల వెంకటరమణ, ఉద్యమకారుడు
2009 డిసెంబర్ 1న రాత్రి ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్ కలిశాను. ఆ రోజు కేటీఆర్‌ను, హరీశ్‌రావును కూడా పోలీసులు ఆసుపత్రిలోకి రానివ్వలేదు. నా ఫోన్ నుంచే మానవ హక్కుల చైర్మన్‌తోనూ, అప్పటి సీఎం రోశయ్యతోనూ కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్‌తో సుమారు 2 గంటలకు పైగా ఉన్నాం. ఉద్యమకారుడిగా కొనసాగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
-బిచ్చాల తిరుమలరావు, న్యాయవాది, న్యాయవాద జేఏసీ చైర్మన్
కేసీఆర్ స్ఫూర్తితోనే 2008లో తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ఏర్పాటు చేశాం. ఖమ్మంలో ఆనాడు ‘జై తెలంగాణ’ అనడానికే చాలామందికి ధైర్యం లేదు. కేసీఆర్ రెండుసార్లు మా ఇంట్లో బస చేయడం మా అదృష్టం. కేసీఆర్ మా ఇంట్లో ఉండగానే వారికి ఫోన్ వచ్చింది. ‘ఎక్కడ ఉన్నారు?’ అని వారు కేసీఆర్‌ను అడిగితే.. ‘మా కృష్ణ ఇంట్లో ఉన్నాను’ అని చెప్పిన మాట నా జీవితంలో ఎప్పటికీ మరువలేను.
-ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు
కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు పెట్టి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ కేసులో కేసీఆర్ ఏ1, నేను ఏ2గా ఉన్నాను. నాతోపాటు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డాక్టర్ విజయరామారావు, కన్నెబోయిన రాజయ్యయాదవ్ ఉన్నారు. వారితోపాటు ఖమ్మానికి చెందిన బత్తుల సోమయ్య, గోపగాని శంకర్రావు, అబ్దుల్ నబీ కూడా జైల్లో ఉన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తితో ఉద్యమంలో నడవడంతో నా జీవితం సార్థకమైంది.
-డోకుపర్తి సుబ్బారావు, ఉద్యమకారుడు
కరీంనగర్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారని తెలిసి ఆ రోజున నాలో దుఃఖం ఆగలేదు. రాజమండ్రిలో కేసీఆర్‌ను చంపుతారని మేం భయపడ్డాం. కేసీఆర్ లేకపోతే రాష్ట్రం రాదని ఆందోళన చెందాం. ఆ తరువాత కేసీఆర్‌ను ఖమ్మం తీసుకొచ్చి ఇక్కడి జైలుకు తరలించారు. మేం రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం.
-పగడాల నరేందర్, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు