ఖమ్మం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆంధ్ర పాలకులకు సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు, స్వరాష్ట్రంలో సగర్వంగా జీవించే హక్కును కల్పించేందుకు, వివక్షను పారదోలేందుకు, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు ఊపిరిపోసుకున్న గులాబీ జెండా నేటితో 26వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలో పాతికేళ్లపాటు అగ్నిజ్వాలగా మండిన ఈ పోరుజెండా నేడు రజతోత్సవాలు జరుపుకుంటోంది. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని నమ్మిన ఉద్యమ నేత కేసీఆర్.. నాటి తెలంగాణ మేధావులైన కొండా లక్ష్మణ్‌బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సమక్షంలో గులాబీజెండా రూపకల్పన చేశారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్‌బాపూజీ నివాసమైన జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న గులాబీ జెండాతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను స్థాపించారు.
గులాబీరంగులో తెలంగాణ పటం ఉన్న జెండాను రూపొందించిన కేసీఆర్.. దానిని భుజాన వేసుకున్నారు. పట్టుమని పిడికెడు మంది కూడా లేని టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీని ఇప్పుడు తెలంగాణలోనే అతిపెద్ద పార్టీగా నిలిపారు. ఎంతో వివక్షను, ఎన్నో అణిచివేతలు, మరెన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేశారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. తెలంగాణను సాధించారు. ఆ తరువాత కూడా అదే గులాబీ జెండాతో పదేళ్ల స్వర్ణయుగ పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దారు. విశ్వ యవనికపై తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశారు. తెలంగాణకు దశ, దిశగా గులాబీజెండాను నిలిపారు. ఇంతటి ఘనత సాధించిన బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్ల కాలం పూర్తయినందున పార్టీ శ్రేణులన్నీ ఊరూవాడా సంబురాలు జరుపుకుంటున్నాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ చేతుల్లో ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ తన జీవనగమనంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపింది. ఉద్యమ తీవ్రతను, స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పింది. 14 ఏళ్లపాటు సుదీర్ఘపోరాటం చేసింది. ఆంధ్ర పాలకుల కుట్రలను చీల్చిచెండాడింది. ఢిల్లీ పెద్దల పీఠాలు కదిలించింది. గత్యంతరం లేని పరిస్థితి కల్పించింది. 2014 జూన్ 2న స్వేచ్ఛాయుత తెలంగాణకు ఆయువు పోసింది. అటు పిమ్మట కూడా పాలకపక్షమై నిలిచింది. అభివృద్ధిలో తెలంగాణను పదేళ్లపాటు అన్నింగా అగ్రభాగాన నిలిపింది. గడిచిన రెండున్నరేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంస పాలనను చీల్చిచెండాడుతోంది. ప్రజల పక్షాన పోరాడుతోంది.
తమ స్వేచ్ఛావాయువుల తెలంగాణ తమకే కావాలని, పరాయి పాలన తమకు వద్దేవద్దని పిడికిలి బిగించి నినదించించి ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలోని గులాబీ జెండా. అలా పాతికేళ్లనాడు ‘జై తెలంగాణ’ నినాదంతో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం 14 ఏళ్లపాటు అప్రతిహతంగా కొనసాగింది. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చుకొని సొంత గడ్డ అభివృద్ధికి పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్.. అందులోనూ అగ్రగామిగా నిలిపింది. యావత్ దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో మొదటి స్థానాన్ని పొందింది. ‘జయహో తెలంగాణ’ నినాదంతో దేశానికే ఆదర్శంగా నిలిచింది.
స్వరాష్ట్ర గొంతుకగా మొదలైన బీఆర్ఎస్ జెండా.. తెలంగాణ సాధనతో సంపూర్ణతను సాధించింది. ‘జై తెలంగాణ’ అంటూ నినదించేందుకే భయపడిన రోజుల్లో అట్టడుగు నుంచి మొదలుపెట్టిన ఉద్యమస్వరం.. గులాబీ జెండా సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. పాలనాదక్షతతో స్వరాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపింది. తెలంగాణ ఉద్యమ ప్రభావమే లేదనుకొని ఆనాడు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చిన నాటి ఉమ్మడి పాలకులకు ఇక్కడ దద్దరిల్లిన ‘జై తెలంగాణ’ నినాదాలు భయాన్ని కలిగించాయి. తెలంగాణ సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. ఇదే గడ్డపై అభివృద్ధి, సంక్షేమానికి అగ్రతాంబూలం వేశారు. అదే స్ఫూర్తితో నేడు ప్రతిపక్షంలోనూ గులాబీజెండా ఉవ్వెత్తున పోరాడుతోంది.
కేసీఆర్ నాయకత్వంలో తొలి రోజుల్లో గులాబీ జెండా ఎత్తుకుంటే ఏవగింపుగా చూశారు. ఎగతాలి చేశారు. ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొని బీఆర్ఎస్ జెండాను భుజాన పెట్టుకొని కేసీఆర్ వెంట నడిచాం. తెలంగాణను సాధించాం. అభివృద్ధి, సంక్షేమంలో ముందువరుసలో నిలిపాం. ఇప్పటికీ ప్రజల ఆదరణ చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.
-బొమ్మెర రామ్మూర్తి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో ఖమ్మంలో గులాబీ జెండా మోసేవాళ్లు ఎవరూ లేరు. కొద్దిమంది మిత్రులం కలిసి బీఆర్ఎస్లో చేరాం. ఉద్యమంలో అనేకసార్లు లాఠీ దెబ్బలు తిన్నాం. జైలుకు వెళ్లాం. తెలంగాణ సాధించాం. ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. అభివృద్ధి ఫలాలు ఆస్వాదిస్తున్నాం.
-గుండ్లపల్లి శేషగిరిరావు, బీఆర్ఎస్ నాయకుడు
ఖమ్మంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో పలువురు ఆంధ్రా ప్రాంతం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఇక్కడి వారి రాజకీయ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న విధానాన్ని గమనించాను. ఆ వెంటనే గులాబీ జెండాను భుజానికి ఎత్తుకున్నాం. వివక్షను చెండాడి స్వరాష్ర్టాన్ని సాధించాం. అభివృద్ధిని ప్రజలకు అందించాం.
-ఉప్పల వెంకటరమణ, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు
ఒక్కడిగానే తొలి అడుగు వేసిన కేసీఆర్.. ‘జై తెలంగాణ’ నినాదంతో సబ్భండ వర్గాలను ఏకం చేశారు. పట్టు విడువకుండా ఢిల్లీ పెద్దల మెడలు వంచి స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. అయితే, కేసీఆర్ పిలుపు మేరకు ఖమ్మంలో ఎవ్వరు సహకరించకపోయినప్పటికీ పిడికెడు మందిగా ఉన్న మేమే గులాబీ జెండాను భుజానికి ఎత్తుకున్నాం. నిర్బంధాలను ఎదుర్కొని తెలంగాణను సాధించాం. బతికున్నంతకాలం కేసీఆర్‌తోనే ప్రయాణం.
– డోకుపర్తి సుబ్బారావు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు
తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్. ఖమ్మంలో తెలంగాణవాదం ఉన్నప్పటికీ ఆంధ్రా ఆధిపత్యం వల్ల తొలినాళ్లలో పార్టీ నిర్మాణం కష్టతరమైంది. గులాబీ జెండాలు పట్టుకుని బయలుదేరితే అవహేళన చేశారు. కానీ, అనుకున్న లక్ష్యాన్ని సాధించి స్వరాష్ట్ర కలను సాకారం చేశాం. ఎల్లవేళలా కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తున్నాం.
-లింగనబోయిన సతీశ్, ఉద్యమకారుడు