న్యూఢిల్లీ/రాంచీ, ఆగస్టు 3: నియామక పరీక్షల్లో అక్రమాలకు సంబంధించి జార్ఖండ్లో జెన్ జీ నిరసనలు ఉధృతమయ్యాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(జేఎస్ఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాంచీలో వందలాది మంది వారం రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 14వ జేపీఎస్సీ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సబంధించిన వివాదం దీనికి తక్షణ కారణంగా నిలిచినప్పటికీ రాష్ట్ర నియామక వ్యవస్థలో ఏండ్లుగా జరుగుతున్న జాప్యం, పారదర్శకత లోపం, అక్రమాలకు ఈ నిరసన అద్దం పడుతున్నదని విద్యార్థులు పేర్కొంటున్నారు.
14వ జేపీఎస్సీ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన వివాదం ప్రస్తుత నిరసనలకు తక్షణ కారణంగా నిలిచింది. మీడియా కథనాల ప్రకారం కమిషన్ 103 ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జూలై ఆరంభంలో ప్రాథమిక పరీక్ష పలితాలను ప్రకటించిన తర్వాత ప్రధాన పరీక్ష కోసం 2,204 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు అక్రమాలు జరిగాయని ఆరోపించడం ప్రారంభించారు. క్యాటగిరీల వారీగా కటాఫ్ మార్కులను ప్రకటించకపోవడం విద్యార్థులు లేవనెత్తిన ప్రధాన ఆందోళనల్లో ఒకటి. అలాగే విడుదల చేసిన మెరిట్ జాబితాపై కమిషన్ సభ్యుల సంతకాలు లేవని నిరసనకారులు ఆరోపించారు. ఇది ఆ ప్రక్రియపై సందేహాలకు తావిచ్చింది. అర్హత సాధించిన అభ్యర్థికి చెందినదిగా భావిస్తున్న ఒక ఓఎంఆర్ సమాధాన పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.
అర్హత సాధించడానికి అవసరమైన 144 మార్కులతో పోలిస్తే చాలా తక్కువగా కేవలం 48 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాసినప్పటికీ సదరు అభ్యర్థిని ప్రధాన పరీక్షకు ఎంపిక చేశారని నిరసనకారులు ఆరోపించారు. అయితే, ఆ ఓఎంఆర్ షీట్ ప్రామాణికత నిర్ధారణ కానప్పటికీ ఈ ఘటనతో అక్రమాలపై దర్యాప్తు కోసం డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ ఆరోపణలను పురస్కరించుకుని దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీఐడీని జార్ఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే తమ ఆందోళన 14వ జేపీఎస్సీ పరీక్షకు మాత్రమే పరిమితం కాదని విద్యార్థి నాయకులు చెబుతున్నారు. జేపీఎస్ఎసీ, జేఎస్ఎస్సీ, ఇతర రాష్ట్ర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు, పరీక్షల జాప్యం, పారదర్శకత లోపం వంటి అంశాలనూ ఏండ్లుగా పేరుకుపోయిన అసహనానికి ఈ నిరసన అద్దం పడుతున్నట్లు నిరసనకారులు తెలిపారు.
విద్యార్థుల ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సైతం మద్దతు ప్రకటించింది. సీజేపీ నాయకులు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా నిరసన తెలుపుతున్న అభ్యర్థులతో ఫోన్లో మాట్టాడినట్లు పార్టీ తెలిపింది. ఈ ఉద్యమానికి వారు సంఘీభావం ప్రకటించడంతోపాటు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై అభ్యర్థుల ఆందోళనల గురించి చర్చించారు.
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలున్నాయని విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఉధృతంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్లో మరో సోనమ్ వాంగ్చుక్ అంటూ విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహథో గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రిలిమినరీ పేపర్లో అవకతవకలకు వ్యతిరేకంగా ఆయన గత ఆదివారం రాత్రి నుంచి జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్షకు దిగారు. దేవేంద్ర మాట్లాడుతూ.. ‘కొన్ని వారాలుగా నిరసనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదు.. జూలై 5న పరీక్ష ఫలితాలు వచ్చినప్పటి నుంచే పరీక్షలో జరిగిన అవకతవకలు తెరమీదికొస్తున్నాయి. జూలై 25 నుంచి సత్యాగ్రహం నిర్వహిస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. అందుకే నిరాహార దీక్షకు దిగాను’ అని దేవేంద్ర వెల్లడించారు. ఈ పరీక్షపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని దేవేంద్ర డిమాండ్ చేశారు.