న్యూఢిల్లీ, అక్టోబర్ 5: వివిధ ల్యాబ్‌లలో రాజీనామా చేసిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధకుల సుదీర్ఘ జాబితాలో ఓపెన్ఏఐ భద్రత అధిపతి డేవిడ్ రాబిన్సన్ చేరారు. తన రాజీనామాను ప్రకటిస్తూ పరిశ్రమ మొత్తం మరింత అధునాతన ఏఐ మోడల్స్ కారణంగా ముప్పును ఎదుర్కొంటున్నదని, దీని కారణంగా ఓపెన్ఏఐ సంస్కృతి దెబ్బతిందని ఆయన అన్నారు. ఓపెన్ఏఐలో అత్యధిక కాలం పనిచేసిన ఉద్యోగులలో రాబిన్సన్ ఒకరు.
ప్రతి కీలకమైన ఆవిష్కరణలతోపాటు తాము విడుదల చేసిన భద్రతా నివేదికల రూపకల్పనకు తాను నాయకత్వం వహించానని ది అట్లాంటిక్ పత్రిక కోసం రాసిన ఒక వ్యాసంలో డేవిడ్ రాబిన్సన్ తెలిపారు. ప్రస్తుత ఏఐ పంథా ఆమోదయోగ్యం కాదని భావించి బయటకు వచ్చానని ఆయన తెలిపారు. ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు తగినంత జాగ్రత్త వహించడం లేదని, అయితే దీనిని మరింత లోతుగా పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. కేవలం నిర్దిష్ట నిబంధనలు లేదా కొత్త చట్టాలకు పరిమితం కాకుండా మనం మరింత లోతుగా ఆలోచించాలని తాను భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మనం సంస్కృతి గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏఐ భవిష్యత్తు దానిని అభివృద్ధి చేసే కంపెనీల చేతుల్లోనే ఉందని, కానీ ఆ భవిష్యత్తుకు ఒక అంశం కేంద్రంగా ఉందని ఆయన అననారు. సిలికాన్ వ్యాలీకి కొరవడిన వివేకం మీద ఏఐ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు. ప్రమాదకరమైన సాంకేతికతను ఎలా నిర్వహించాలనే దానిపై వివేకం, ఇంకా ముఖ్యంగా ప్రజల పట్ల శ్రద్ధ వహించడం అంటే ఏమిటో తెలిపే వివేకం అవసరమని ఆయన తెలిపారు.