హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి లోపాలను అత్యంత కచ్చితత్వంతో సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక ఓటరు కూడా జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్‌ల డిజిటైజేషన్లో నాణ్యతను మరింత మెరుగుపరచాలని కోరారు. హైదరాబాద్ నుంచి అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన జిల్లా ఎన్నికల అధికారులు, ఇతరులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డిజిటలైజేషన్ పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. గైర్హాజరైన, నివాసం మార్చుకున్న, మరణించిన, నకిలీ ఓటర్ల (ఏఎస్‌డీడీ) జాబితాల పునఃపరిశీలన, విశ్లేషణ, నో మ్యాపింగ్ కేసులను సమగ్రంగా పరిశీలించి కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని సీఈవో స్పష్టంచేశారు. డిజిటలైజేషన్ సమయంలో ఫొటోలు లేకపోవడం, జన్మతేదీల్లో వ్యత్యాసాలు, లింగ వివరాల్లో పొరపాట్లు, సంతకాల్లో లోపాలను తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. అన్ని ఏఎస్‌డీడీ కేసులను తుది నిర్ణయానికి ముందు పునఃపరిశీలించి సరైన వర్గీకరణ చేయాలని కోరారు. లోపాలు గుర్తించిన సందర్భంలో రోల్-బ్యాక్ సదుపాయాన్ని వినియోగించి, రికార్డులను మళ్లీ పరిశీలించి అవసరమైన సవరణలు చేయాలన్నారు. ఒకే కుటుంబసభ్యులను వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు విభజించబడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.