పెనుబల్లి, జనవరి 30 : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని రామచంద్రపురం, డవరం, మండాలపాడు, పాతకారాయిగూడెం గ్రామాల్లో పెద్ద పులి అలికిడి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. రామచంద్రాపురం నుంచి నీలాద్రి గుడికి వెళ్లే ప్రాంతంలో పులి రోడ్డు దాటుతుండగా చూశామని కొందరు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది ఆదివారం ఉదయం గ్రామాల్లో పర్యటించి అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. మండాలపాడు, లంకపల్లి జాతీయ రహదారి మధ్య నుంచి పాతకారాయిగూడెం వరి పొలాల మీదుగా పులి అటవీప్రాంతానికి వెళ్తున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సత్తుపల్లి రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎఫ్‌డీవో సతీశ్‌కుమార్ పులి పాదముద్రలను సేకరించారు. కాగా, పులి దట్టమైన అటవీప్రాంతంలోకే వెళ్తున్నదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సత్తుపల్లి రేంజ్ అధికారి వెంకటేశ్వర్లును తెలిపారు. పులి పాదముద్రలు సేకరించామన్నారు. గ్రామస్తులెవరూ అటవీప్రాంతంలోకి వెళ్లొద్దన్నారు.