ఖమ్మం రూరల్/ రఘునాథపాలెం, మే 6: ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రం సహా పరిసర మండలాల్లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు 30 నిమిషాలపాటు ఈదురుగాలలు వీచాయి. దీంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ సుమారు 2 గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఇక ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల, గుర్రాలపాడు, గోళ్లపాడు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా తడిసిపోయింది. అప్పటికే రైతులు ఉరుకులు పరుగులు పెట్టి సొంత టార్పాలిన్లు కప్పుతూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నించినా చాలా వరకూ పంట నష్టం జరిగింది. తల్లాడ – వైరా ప్రధాన మార్గంలో గాలిదుమారానికి భారీ వృక్షాలు కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు జేసీబీ యంత్రాలతో చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
భానుడి భగభగలతో మధ్యాహ్నం వరకూ ముప్పుతిప్పలు పడ్డ ఖమ్మం నగర వాసులపై వరుణుడు సాయంత్రం విరుచుకుపడ్డాడు. భారీగా కురిసిన వర్షం వల్ల జిల్లా కేంద్రంలో జనజీవనం స్తంభించింది. ఖమ్మం నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగి పడటంతో మూడు గంటలకు పైగా ఖమ్మంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో నగర ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డారు. త్రీటౌన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వైరా రింగు రోడ్డు సెంటర్లో భారీ వృక్షం నేలకూలింది. దీంతో మోటర్ సైకిల్ ధ్వంసమైంది. వైరా వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ధాన్యం నీటమునిగింది.