రఘునాథపాలెం, డిసెంబర్ 26: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోనే యూరియా కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఒకే ఒక మండలంగా ఉన్న రఘునాథపాలెంకు సరిపడా యూరియా అందించలేకపోతున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ సొసైటీ వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం బారులుదీరారు. వ్యవసాయాధికారులు తొలుత రైతులకు కూపన్లు ఇచ్చి క్యూలో పంపించారు.
అయితే వచ్చిన రైతులకు అనుగుణంగా కేంద్రాల్లో యూరియా నిల్వలు లేకపోవడంతో రైతులంతా కేంద్రం బయటే పడిగాపులు కాస్తూ ఎదురుచూశారు. కాగా, సొసైటీకి 445 బస్తాల యూరియా రాగా.. ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇచ్చి సర్దుబాటు చేశారు. పూర్తి స్టాకు లేకపోవడంతో కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగారు. మంచుకొండ, వీ వెంకటాయపాలెం సంఘాల పరిధిలో అర్హత గల రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు కూపన్లు జారీ చేయగా.. కేంద్రాల వద్ద అధికారులు యూరియా పంపిణీ చేశారు.
కానీ, స్టాకు లేకపోవడంతో అనేక మంది రైతులు ఇంటిబాట పట్టారు. మంచుకొండ సొసైటీ పరిధిలో గిరిజన గ్రామాలతోపాటు అత్యధిక గ్రామాలు ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు తరలివచ్చారు. అయితే అవసరానికి సరిపడా రైతులకు యూరియాను వ్యవసాయాధికారులు పంపిణీ చేయలేకపోయారు. మొక్కజొన్న, వరి, కూరగాయల సాగుకు కేంద్రంగా ఉన్న మండలంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం అందించలేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.