ఖమ్మం, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మూడు ఏడుపులు.. ఆరు పెడబొబ్బలు.. తొమ్మిది శాపనార్థాలు’ అన్నట్లుంది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టికెట్ కేటాయింపు ప్రక్రియ పార్టీకి తలకు మించిన భారంలా పరిణమించింది. ఈ నెల 15న ప్రకటించిన జాబితాలో మధిర, భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి. అప్పుడు కూడా ఆశావహులు రచ్చకెక్కి పార్టీ అధిష్ఠానంపై దుమ్మెత్తిపోశారు. తాజాగా శుక్రవారం పార్టీ ప్రకటించిన రెండో జాబితాపైనా ఆశావహుల రుసరుసలు.. కస్సుబుస్సులు మొదలయ్యాయి.. ‘నేను సీనియర్ని.. నేను పార్టీకి సేవకుడిని.. టికెట్ అడిగే హక్కు ఒక్క నాకు మాత్రమే ఉంది..’ అంటూ ఒక్కో నాయకుడు ఒక్కో నిరసన గళం వినిపిస్తున్నాడు. ఏడుపుల పర్వం.. శాపనార్థాల పర్వానికి తెరతీశారు. ఒకవైపు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు సీట్ల సంగతి తేల్చలేకపోవడం గమనార్హం. ప్రస్తుతం టికెట్ పొందిన అభ్యర్థులు బుజ్జగింపుల పనిలో ఉన్నారు. బుజ్జగింపులు పూర్తయి ఇక ప్రచారంలోకి వచ్చేదెన్నడో. మరో వైపు జరుగుతున్న పరిణామాలను చూసి సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకోవడం కొసమెరుపు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగ తగులుతున్నది.. సీట్ల కేటాయింపు విషయంలో మొదలైన ముసలం ఇప్పుడు రగడలా మారింది.. ‘నేను సీనియర్ని.. నేను పార్టీకి సేవకుడిని.. టికెట్ అడిగే హక్కు ఒక్క నాకు మాత్రమే ఉంది..’ అంటూ ఒక్కో నాయకుడు ఒక్కో నిరసన గళం వినిపిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు సీట్ల సంగతి తేల్చలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు రెండు విడతలుగా శాసనసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 15న మొదటి జాబితాను ప్రకటించగా ఆ జాబితాలో మధిర, భద్రాచలం సిట్టింగ్ శాసనసభ్యులైన మల్లు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్యకు చోటు దక్కింది. ఇక శుక్రవారం రాత్రి విడుదలైన రెండో జాబితా కొందరు ఆశావహులను నిరాశ పరిచింది.
పాలేరు సీటు కోసం పోరు..
కాంగ్రెస్ పార్టీ రెండోజాబితాలో పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. పాలేరు సీటు రాలేదనే అసంతృప్తిలో పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి మనస్తాపానికి గురై ఆమె పార్టీ అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. తన అనచరులతో కలిసి మీడియా ముఖంగా గోడు వెళ్లబోసుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు. అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కార్యకర్తలతో మరోసారి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మరోవైపు ఇదే స్థానం నుంచి రాయల నాగేశ్వరరావు సీటు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన వద్దకు పొంగులేటి వెళ్లి బుజ్జగించడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది.
ఖమ్మంలో బుజ్జగింపులు..
ఖమ్మం సీటును తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించడంతో ఇప్పటికే పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న జావేద్, చోటే బాబా వంటి నాయకులు మనస్తాపం చెందినట్లు తెలుస్తున్నది. వారిని బుజ్జగించే పనిలో తుమ్మల ఉన్నట్లు సమాచారం. వీరేకాక మరికొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు బోగట్టా.
‘పినపాక’లో కాంగ్రెస్ నేతలు భగ్గు..
పినపాక సీటును పాయం వెంకటేశ్వర్లుకు కేటాయించడంతో టికెట్ కోసం దరఖాస్తు చేస్తున్న బట్టా విజయ్‌గాంధీ, చందా సంతోశ్, పోలెబోయిన శ్రీవాణి, కాటిబోయిన నాగేశ్వరరావు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరిలో కొందరు ఈ మేరకు శనివారం మణుగూరులో విలేకర్ల సమావేశం కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బట్టా విజయ్‌గాంధీ తన అనుచరులతో తన స్వగ్రామమైన పోలవరంలో సమావేశమయ్యారు. ఇలా ‘ఎవరికి వారు యమునా తీరు..’ అన్నట్లు పార్టీ వర్గాలుగా విడిపోయింది. ఉమ్మడి జిల్లాలో ‘హస్తం’ ఛిద్రమవుతున్నది. ప్రస్తుతం టికెట్ పొందిన అభ్యర్థులు బుజ్జంగింపుల పనిలో ఉన్నారు. బుజ్జగింపులు పూర్తయి ఇక ప్రచారంలోకి వచ్చేదెన్నడో. మరో వైపు జరుగుతున్న పరిణామాలను చూసి సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకోవడం గమనార్హం.
రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ;పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఆశావహులు
టికెట్ ఆశించిన తమ నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం పాయం వెంకటేశ్వర్లుకు టికెట్ కేటాయించడం పట్ల తాము అసంతృప్తిగా ఉన్నామని, రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ టిక్ ఆశావహులు అన్నారు. రహస్యంగా సమావేశమైన వారు అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి కొంత కాలంగా నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టి, పలు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన తమను కొందరు పొంగులేటి, పాయం అనుచరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మా భవిష్యత్, మా పదవుల పట్ల మాకే భయాన్ని కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన తమకు కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన టికెట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని లైన్‌ను ఏనాడూ దాటబోమని, కానీ తమ భవిష్యత్ కోసం భరోసా ఇవ్వని అధిష్టానం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నామన్నారు. మరో రెండు రోజుల్లో మా అనుచరులతో, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. కొందరు నాయకులు మా అనుచరులపై బెదిరింపులకు పాల్పడుతున్న తీరును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో చందా సంతోశ్, బట్టా విజయ్‌గాంధీ, పోలెబోయిన శ్రీవాణి, కాటిబోయిన నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు నవీన్, ఇక్బాల్ హుస్సేన్, ఆయా ఆశావహుల ప్రధాన అనుచరులు ఉన్నారు.
కష్టపడి పనిచేసిన వారికి మొండి‘చేయి’
ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పార్టీ అభివృద్ధి కోసం నిత్యం కృషిచేస్తున్న యువతకు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపుతున్నదని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడు బట్టా విజయ్‌గాంధీ అన్నారు. శుక్రవారం ప్రకటించిన కాంగ్రెస్ రెండో విడత టికెట్ల జాబితాలో పాయం వెంకటేశ్వర్లుకు టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మండలంలోని పోలవరంలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని విస్తృతంగా చేపట్టి పార్టీ అభివృద్ధికి తాను కష్టపడ్డానని, ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సమాజంలో డబ్బుకు ఉన్న విలువ పార్టీ నాయకులు, కార్యకర్తలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభీష్టం మేరకు తన నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తానన్నారు. సమావేశంలో సోంపల్లి సర్పంచ్ తాటి వీరాంజనేయులు, ఉప్పుసాక సర్పంచ్ వెంకటేశ్వర్లు, నకిరిపేట సర్పంచ్ సర్పా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, ఇరవెండి మాజీ సర్పంచ్ శ్రీలక్ష్మి, సోంపల్లి ఉపసర్పంచ్ పెంకి సంతోశ్, గుండె వెంకన్న, నిమ్మల హరీశ్‌యాదవ్, ముర్రం రాంబాబు, హనీఫ్, భట్టా విజయ్‌గాంధీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాలేరు కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసమ్మతి..
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ టికెట్ ఇస్తారని కష్టపడితే పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి అసమ్మతి గళాన్ని వినిపించారు. పాలేరులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవీరెడ్డి మాట్లాడారు. తాను నాలుగు మండలాల్లో తిరిగి పార్టీని ముందుకు తీసుకొని పోయానని అయితే టికెట్ల పంపకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. మహిళా కోటాలో అయినా టికెట్ ఇస్తారని ఆశించామని తెలిపారు. నాలుగు, ఐదు రోజుల్లో భవిష్యత్ ప్రణాళికను అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలిగా పనిచేశానని పార్టీ ఇచ్చిన ప్రతీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి తనవంతుగా పనిచేశానన్నారు. పాలేరులో పుట్టిన నాకు టికెట్ ఇవ్వకపోటానికి కారణాలు చెప్పాలన్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో ఉన్న నేను ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పూర్తి బాధ్యతగా పని చేశానన్నారు.