ఖమ్మం, ఆగస్టు 29: ‘మున్నేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పరీవాహక ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. ఇందుకోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. మున్నేరు వరద బాధితులకు ఐటీసీ అందించిన రూ.కోటి విలువైన గృహ వినియోగ వస్తువులను ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. మున్నేరుకు ఇరువైపులా ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం వేగంగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని అన్నారు. – ఖమ్మం, ఆగస్టు 29
మున్నేరు ముంపు సమస్యకు శాశ్వత పరిషారం కోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలో మునుపెన్నడూ చూడని వరదలను ఈసారి చూశామని, రాత్రికి రాత్రి వరద తీవ్రత ప్రమాద స్థాయికి చేరుకుందని గుర్తుచేశారు. అధికారుల కృషి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో వరదలను ఎదుర్కోగలిగామని అన్నారు. మున్నేరు వరద బాధితులకు ఐటీసీ అందించిన రూ.కోటి విలువైన గృహ వినియోగ వస్తువులను ఖమ్మం నయాబజార్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. మున్నేరు వరద ఒక్కసారిగా ఉధృతంగా వచ్చినా యుద్ధప్రాతిపదికన ఎదుర్కొన్నామని అన్నారు. ముంపు బాధిత కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని అన్నారు. ఆ తరువాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మున్నేరు సమస్యను వివరించగా సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు.
అతి త్వరలో ఆయా పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. రూ.30 కోట్లతో పద్మావతినగర్ రంగనాయకుల గుట్ట, ప్రకాశ్‌నగర్ వద్ద మరో మూడు చెక్‌డ్యాములను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. మున్నేరుపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి బ్రిడ్జి పకనే మరో నూతన వంతెన నిర్మాణాన్ని రూ.180 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. పేదల పరిస్థితి వివరించగా తక్షణమే స్పందించి బాధితులకు రూ.కోటి విలువైన గృహ వినియోగ వస్తువులను అందజేసినందుకు ఐటీసీ కంపెనీ సీఈవో కులకర్ణికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దీంతోపాటు మున్నేరు ముంపు బాధితులకు రూ.1.50 కోట్ల నగదు పంపిణీకి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముంపు బాధితుల కోసం రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ తన తాత సంస్థ నుంచి రూ.50 లక్షలు అందించారని గుర్తుచేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఐటీసీ సహకాంరతో 2,461 మంది మున్నేరు బాధితులకు గృహోపకరణ వస్తువులు అందజేస్తున్నట్లు అన్నారు. పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, ఆదర్శ్ సురభి, కూరాకుల నాగభూషణం, జీ.గణేశ్, చెంగళ్రావు, కమర్తపు మురళి, మాటేటి లక్ష్మీ, కన్నం వైష్ణవీ ప్రసన్నకృష్ణ, తోట గోవిందమ్మ, దండా జ్యోతిరెడ్డి, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలోనే క్రీడలకు ప్రాధాన్యం
ఖమ్మం సిటీ, ఆగస్టు 29: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వంలోనే క్రీడలకు అధిక ప్రాధాన్యం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా పటేల్ స్టేడియంలో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. స్టేడియంలోని మొదటి ఫ్లోర్ నిర్మాణానికి రూ.1.20 కోట్లు, వాలీబాల్ కోర్టులకు, అథ్లెటిక్ ట్రాక్‌ల ఫెన్సింగ్‌కు రూ.27 లక్షలు, జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియానికి రూ.70 లక్షలు, ఆర్చరీ ప్రాంగణానికి రూ.8.60 లక్షలు, ఓపెన్ జిమ్ సెంటర్‌కు రూ.5 లక్షలు, క్రికెట్ డే అండ్ నైట్ మ్యాచ్‌ల నిర్వహణకు రూ.20 లక్షలతో ప్లడ్ లైట్స్ ఏర్పాటు, రూ.12 లక్షలతో మినీ స్విమ్మింగ్ ఫూల్, రూ.93 లక్షలతో అంతర్జాతీయ స్థాయిలో మూడు సింథటిక్ టెన్నీస్ లాన్ కోర్టుల నిర్మాణం, రూ.26 లక్షలతో సింథటిక్ స్కేటింగ్ రింక్‌ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
సెప్టెంబర్ 1 నుంచి క్రీడా కిట్లు పంపిణీ..
పటేల్ స్టేడియంతోపాటు పెవిలియన్ గ్రౌండ్లో రూ.1.50 కోట్లతో బాస్కెట్‌బాల్ ఇండోర్ ఉడెన్ కోర్టు, రూ.2.50 కోట్లతో వైరా ఇండోర్ స్టేడియం, రూ.3.40 కోట్లతో కల్లూరు మినీ స్టేడియం, రూ.2.65 కోట్లతో మధిరలో మినీ స్టేడియాలను నిర్మిస్తున్నామని మంత్రి పువ్వాడ వివరించారు. కేవలం సీఎం కేసీఆర్ సహకారంతోనే జిల్లాలో క్రీడలకు ఇంతటి ప్రాధాన్యత లభించిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి జిల్లా వ్యాప్తంగా క్రీడా కిట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. క్రీడాకారులు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిభను మెరుగుపర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని అన్నారు. జడ్పీ, టీఎస్ సీడ్స్, డీసీసీబీ, సుడా చైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పునుకొల్లు నీరజ, ఆదర్శ్ సురభి, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, ఎండీ మగ్బుల్ పాల్గొన్నారు.
మంత్రి పువ్వాడను కలిసిన కోనేరు సత్యనారాయణ
ఖమ్మం, ఆగస్టు 29: బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోనేరు చిన్ని త్వరలో సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న నేపథ్యంలో అజయ్‌కుమార్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. నాయకులు రా వి రాంబాబు, కోనేరు నాగేశ్వరరావు, ఆసిఫ్, స్టీవెన్, లాజరస్, ఖాసిం, యాకువుద్దీన్, హరిహరన్ యాదవ్, జోగు రమాదేవి, ఈసం రమాదేవి, శోభారాణి, రవి గౌడ్, శీను పాల్గొన్నారు.