కూసుమంచి (నేలకొండపల్లి) మే 20: పేదలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే తనకు ఈ అవకాశం లభించిందని అన్నారు. అందుకే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని అన్నారు. నేలకొండపల్లి మండలం గువ్వగూడెం, ముజ్జుగూడెం, అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లి గ్రామాల్లోని ప్రజలతో సోమవారం నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి కోడ్ ముగియగానే వాటిని పరిష్కస్తానని అన్నారు.
ఈ సందర్భంగా గువ్వలగూడెంలో జరిగిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత తనదేనని అన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఉన్నందున తనకు ఈ అవకాశాన్ని కల్పించిన పాలేరుకు ఎక్కువ ఇళ్లు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు రాయల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, శాఖమూరి రమేశ్, వెన్నెపూసల సీతారాములు, నెల్లూరి భద్రయ్య, బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న, రాయపుడి నవీన్, వంగవీటి నాగేశ్వరరావు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.