మధిర, అక్టోబర్ 05: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి, ఓ ఇంటిని గుల్ల చేశారు. పట్టణంలోని 21వ వార్డులో ఆదివారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..21వ వార్డుకు చెందిన వెంపాటి రాజేంద్రప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఖమ్మం వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్న రాజేంద్రప్రసాద్‌కి తలుపులు తెరిచి ఉండడం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
దుండగులు బీరువాను పగలగొట్టి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. 12 గ్రాముల బంగారం, నాలుగు బియ్యం బస్తాలు, నాలుగు ఇత్తడి కాగులు సుమారు రూ.10 వేల నగదు, విలువైన బట్టలు దొంగతనానికి గురైనట్లు రాజేంద్రప్రసాద్ స్థానిక మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.