ఖమ్మం రూరల్, మే 31 : అసలే అది ప్రధాన రహదారి. ఆపై చిన్నారుల బడి. నిత్యం గర్భిణీలు, బాలింతల రాకతో సందడిగా ఉండే అంగన్వాడీ కేంద్రం. అయితే ఈ కేంద్రం ఎదురుగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట ఇందిరమ్మ కాలనీలో గతేడాది అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేంద్రంలో ఐసీడీఎస్ సేవలు ప్రారంభమయ్యాయి. కాలనీలో ఏకైక అంగన్వాడీ కేంద్రం కావడంతో అటు గర్భిణీలు, బాలింతలు ఇటు చిన్నారులు పెద్ద మొత్తంలోనే వచ్చి సేవలు పొందుతున్నారు.
అయితే ఈ అంగన్వాడీ కేంద్రం కాలనీలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో పిల్లలు రోడ్డు మీదకు వచ్చిన ప్రతిసారి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఒకటి రెండుసార్లు ద్విచక్ర వాహనాలు తగలడంతో పిల్లలు ప్రమాదానికి గురయ్యారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు లేదా ఐసీడీఎస్ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ ఏర్పాటు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.