ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 11 : అక్రమ కేసులకు భయపడేది లేదని, లగచర్ల బాధితుల కోసం కేటీఆర్ చేసిన పోరాట స్ఫూర్తితో పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ కేసులతో జిల్లా జైలులో ఉన్న టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్, టేకులపల్లి బీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా రాజులను తాతా మధు.. భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్‌తో కలిసి ములాఖత్ ద్వారా మంగళవారం పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో తాతా మధు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు పోలీసులు అత్యుత్సాహంతో సురేందర్, రాజుపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీతోపాటు ఇతర కేసులు పెట్టి జైలుపాలు చేశారని ఆరోపించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని, న్యాయ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పామన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు చేసే కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొంటామన్నారు.
లగచర్ల ఘటనలో కేటీఆర్ న్యాయ పోరాటం చేసి చివరకు ప్రభుత్వం మెడలు వంచారని గుర్తు చేశారు. అక్రమ కేసుల వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు మానుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామగ్రామాన వ్యతిరేకత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటేనే ఉద్యమ పోరాట సారథులని, కాంగ్రెసోళ్లు భయపెడితే భయపడే వారు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదన్నారు. రాబోయే రోజుల్లో తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు ఏ పోలీసు అధికారులైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వారి రిటైర్డ్ అయినా, లేదా ఏ పోస్టులో ఉన్నా తగిన శాస్తి చెబుతామని తాతా మధు హెచ్చరించారు.