72 శాతమే పూర్తి..
రేషన్ కార్డుల ఈ-కేవైసీలో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డుల్లో పేరు ఉండడం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అనేకమంది అనర్హులున్నారని, పైగా కార్డులు కూడా దుర్వినియోగమవుతున్నాయని చెబుతూ అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది.
- భద్రాద్రి జిల్లాలో రేషన్ కార్డుల ఈ-కేవైసీలో గందరగోళం
- వివరాలు సరిపోలని లబ్ధిదారుల డేటా అప్డేషన్ తప్పనిసరి
- మరోసారి గడువు పెంచినా ముందుకు కదలని కేవైసీ ప్రక్రియ
- నేటితో అది కూడా ముగుస్తుండడంతో లబ్ధిదారుల అయోమయం
- వివరాలు, వేలిముద్రల నమోదు కోసం ఆధార్ కేంద్రాలు కిటకిట
చుంచుపల్లి, ఫిబ్రవరి 28 : రేషన్ కార్డుల ఈ-కేవైసీలో గందరగోళం నెలకొంటోంది. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డుల్లో పేరు ఉండడం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అనేకమంది అనర్హులున్నారని, పైగా కార్డులు కూడా దుర్వినియోగమవుతున్నాయని చెబుతూ అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రేషన్‌కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టింది. ఆధార్‌తో వాటిని అనుసంధానం చేస్తోంది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతోంది. పలువురి లబ్ధిదారుల పేర్లు, ఇతర వివరాలు రేషన్‌కార్డు, ఆధార్ కార్డులో సరిపోలకపోవడం, ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానమై లేకపోవడం వంటి కారణాలతో ఈ-కేవైసీ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఆలస్యమవుతోంది. దీనికితోడు ప్రభుత్వం ఇంతకుముందే ఇచ్చిన గడువు పూర్తికావడంతో మరోసారి కూడా ఆ గడువు పెంచింది. ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తి కావస్తుండడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆధార్‌లో మార్పులు చేర్పుల కోసం ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి లబ్ధిదారులతో ఆయా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.
ఈ-కేవైసీ పూర్తయితేనే పథకాల వర్తింపు..
రేషన్‌కార్డులో పేరున్న వాళ్లు మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులని ప్రభుత్వం చెబుతోంది. పిల్లలకు ఆదాయ ధ్రువపత్రాలు సహా ఇతరత్రా సర్టిఫికెట్ల కోసం రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటోంది. అంతేకాక ఈ-కేవైసీ చేయని వారి పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగిస్తారు. తాజా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంతమంది పేర్లు రేషన్ కార్డుల్లో ఉంటాయో వారికే పథకాలు వర్తిస్తాయి. రేషన్ వస్తుంది. దీంతో లబ్ధిదారులు చౌక దుకాణాల్లోని డీలర్ల వద్ద తమ ఈ-కేవైసీని పూర్తి చేసుకుంటున్నారు. వివరాలు సరిపోలని వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
జిల్లా మొత్తంలో 72.43 శాతమే పూర్తి..
భద్రాద్రి జిల్లా మొత్తంలో 72.43 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీని పూర్తి చేసుకున్నారు. ప్రత్యేకంగా చుంచుపల్లి మండలంలో పరిశీలిస్తే అది 64.71 శాతంగానే ఉంది. కొంతమంది వృద్ధులు, చిన్నపిల్లలు, ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారితోపాటు మరికొందరు వేలి ముద్రలు ఈ-కేవైసీ యంత్రంలో నమోదు కావడం లేదు. దీంతో వారంతా ఆధార్‌లో తమ వేలిముద్రలను అప్డేట్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆధార్ కేంద్రాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జనాల తాకిడి పెరగడంతో ఆధార్ కేంద్రాల నిర్వాహకులు రోజుకు 15 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి వివరాలు అప్డేట్ చేస్తున్నారు. కొన్నిచోట్ల టోకెన్ల కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలో నిల్చుంటున్నారు. ఈ తతంగానికి రోజుల కొద్దీ సమయం పడుతుండడంతో రేషన్‌కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ నెల 29 వరకూ ఇచ్చిన మరో గడువు కూడా ముగుస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంటోంది.
రోజుల తరబడి తిరుగుతున్నా టోకెన్లు లభించట్లేదు..
రేషన్ కార్డులో మా ఇద్దరి పిల్లల వివరాలు నమోదు కావడం లేదు. వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆధార్ దింపాం. ఇప్పుడు రేషన్ షాపులోని ఈ-కేవైసీకి వెళితే ఆ యంత్రంలో మా పిల్లల వేలిముద్రలు పడడం లేదు. దీంతో వారి వేలిముద్రలను ఆధార్‌లో అప్డేట్ చేయించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆధార్ కేంద్రానికి వెళ్తే వాళ్లేమో టోకెన్లు అయిపోయాయని చెబుతున్నారు. రోజుకు 15 టోకెన్లే ఇస్తున్నారంట. వాటి కోసం తెల్లవారుజామున 4 గంటలకే వెళ్లాలంట. అయినా రోజుల తరబడి తిరుగుతున్నా టోకెన్లు లభించట్లేదు.
-ఇనగాల ఉమాదేవి, గృహిణి, రుద్రంపూర్
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

