భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో తీవ్ర ఆటంకం ఏర్పడింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హమాలీలు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా జనవరి నెలలో 443 రేషన్ డీలర్ల ద్వారా ప్రభుత్వం 4,350 మెట్రిక్ టన్నుల బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల ఇప్పటివరకు కేవలం 35 శాతం బియ్యం మాత్రమే రేషన్ డీలర్లకు చేరింది. మిగతా 65 శాతం బియ్యం ఇంకెప్పటికి చేరుతుందో ప్రశ్నార్థకంగా మారింది. హమాలీలతో చర్చలు జరుపుతున్న సివిల్ సైప్లె అధికారులు మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. అధికారుల ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి. ఏదేమైనా లబ్ధిదారులకు ప్రతినెలా ‘రేషన్’ సమయానికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-అశ్వారావుపేట, జనవరి 3
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హమాలీలు ఈ నెల 2వ తేదీ నుంచి సమ్మెకు దిగారు. దీంతో గోడౌన్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ నెల 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాల్సిన డీలర్లు పూర్తిస్థాయి కోటా అందక అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా 20వ తేదీ నుంచి నెలాఖరు వరకు నిర్దేశించిన బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. హమాలీలు సమ్మెకు దిగడంతో ఈ బియ్యం ఎప్పటికి అందుతుందోననే డీలర్లు ఆందోళన చెందుతున్నారు. సరిపడా బియ్యం నిల్వలు గోడౌన్లలో నిల్వ లేకపోవడంతో సరఫరా నత్తనడకన సాగుతోంది. త్వరలోనే పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సర్కార్ దొడ్డుబియ్యమే సక్రమంగా పంపిణీ చేయలేకపోతున్నదని లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలు రేషన్ దుకాణాల ద్వారా జనవరి నెల బియ్యం అందుకోవడానికి ఇబ్బందులు తప్పేటట్లు లేవు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని చెబుతున్న హమాలీలు ఎప్పుడు విరమిస్తారో తెలియడం లేదు. హమాలీల డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కనిపించడం లేదు.
బియ్యం పంపిణీపై రేషన్ డీలర్లకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండడంతో అయోమయంలో ఉన్నారు. జిల్లాలో 443 రేషన్ దుకాణాల పరిధిలో 2,93,268 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అంతోద్యయ కార్డులు 21,149, అన్నపూర్ణ కార్డులు 3, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు 2,72,116 కార్డులు ఉన్నాయి. గిడ్డంగుల వద్ద బియ్యం బస్తాలను వాహనాల్లోకి ఎక్కించడం, రేషన్ దుకాణాల వద్ద దిగుమతి చేయడం హమాలీలే చేస్తుంటారు. ఇందుకు 50 కిలోల బస్తాకు ప్రభుత్వం రూ.26 చెల్లిస్తుంది. ఈ ధర పెంచాలని కార్మికులు కోరితే 3 నెలల క్రితం ప్రభుత్వం అదనంగా రూ.3 పెంచింది. అయినప్పటికీ పెంచిన ధరపై జీవో జారీ చేయకపోవడంతో ఓపిక నశించిన హమాలీలు సమ్మెకు దిగారు.
దమ్మపేట/ భద్రాచలం, జనవరి 3: 2024 అక్టోబర్లో జరిగిన జీసీసీ, సివిల్ సప్లయీస్ రేట్ల ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హమాలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, భద్రాచలం మండల కేంద్రాల్లో చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరింది. సమ్మెకు సీపీఎం, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హమాలీల ఎగుమతి, దిగుమతి రేట్లను జనవరి నుంచి అమలు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం హమాలీ రేట్ల పెంపు జీవోను విడుదల చేసి ఎరియర్స్కు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. హమాలీలకు సీపీఎం అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.
హమాలీల సమ్మె కారణంగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా జనవరి నెలకు 4,350 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 35 శాతం బియ్యం రేషన్ దుకాణాలకు చేరాయి. మిగతా 65 శాతం బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం.
-త్రినాథ్, డీఎం, సివిల్ సప్లయీస్, భద్రాద్రి కొత్తగూడెం