పాల్వంచ, మార్చి 8 : పాల్వంచ పట్టణ పరిధిలోని నవ భారత్ కంపెనీ ఉద్యోగుల క్వార్టర్స్‌లో దొంగతనాల కేసులో ప్రధాన నిందితుడిని పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. గత జనవరి 25న కంపెనీ క్వార్టర్స్‌లోని పది ఇండ్లల్లో దొంగలు పడి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు నగదు చోరీ చేశారు. నవ భారత్ కంపెనీ ఉద్యోగుల క్వార్టర్స్‌లో లభించిన శాస్త్రీయ సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పాల్వంచ సీఐ సతీష్ శనివారం మీడియాకు చెప్పారు.
ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సీసీఎస్, పాల్వంచ టౌన్ పోలీసులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడ్డారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. శనివారం పాల్వంచలోని కేటీపీఎస్ సీ కాలనీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని విశ్వసనీయ సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
తనది మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా తండా పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగోలీ (బేల్ గ్యాంగ్) ప్రాంతం అని, తన పేరు అనిల్ సింఘాల్ అని పోలీసుల విచారణలో చెప్పాడు. తమ ప్రాంతానికి చెందిన మరో ముగ్గురితో కలిసి గత జనవరి 25 అర్ధరాత్రి పాల్వంచ నవభారత్ ఎంప్లాయిస్ క్వార్టర్స్‌లో దొంగతనాలు చేసినట్లు తెలిపారు. తాజాగా కేటీపీఎస్ సీ కాలనీలో దొంగతనం చేయడానికి రెక్కీ నిర్వహించినట్లు చెప్పాడు. సదరు వ్యక్తి నుంచి రూ.2 లక్షల క్యాష్, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణ తర్వాత అనిల్ సింఘాల్‌ను కోర్టులో ప్రవేశ పెట్టగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు సీఐ సతీశ్ తెలిపారు.