రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినదగ్గర నుంచీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కుంటుపడింది. రెండు సంవత్సరాలుకావొస్తున్నా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయానికి సొంతంగా పక్కాభవనం లేకపోవడంతో అటు సిబ్బంది, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. కొత్తగా ఏర్పాటైన ఆరు మండలాల్లోనూ ప్రభుత్వ ఆఫీసులకు కొత్త భవనాల్లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలను సైతం ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేసింది. అన్ని జిల్లా కార్యాలయాలను ఒక్కచోట చేర్చి ఐడీఓసీ(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) భవనాన్ని అద్భుతంగా నిర్మించింది. జడ్పీ కార్యాలయానికి సైతం స్థలాన్ని కేటాయించింది. కానీ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలన్న ఆలోచన చేయడం లేదుకదా.. కనీసం ఆ ఊసేఎత్తడం లేదు. దీంతో పాత భవనాల్లోనే అధికారులు ఇబ్బంది పడుతూ పాలన నెట్టుకొస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2019లో జిల్లా పరిషత్ ఏర్పాటైంది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జడ్పీ కార్యాలయం కోసం కొత్త భవనానికి ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించింది. పాలన కొనసాగడానికి అప్పటి కొత్తగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఆఫీస్‌ను కొనసాగించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా జడ్పీ కార్యాలయానికి పక్కా భవనం నిర్మించేందుకు ఆలోచన చేయడం లేదు. స్థలం ఉన్నా నిధులు కేటాయించకపోవడంతో అప్పటి నుంచీ పాత భవనంలోనే ఆఫీస్ కొనసాగుతున్నది. స్థాయీసంఘాల సమావేశాలు, జడ్పీ జనరల్ బాడీ సమావేశాలకు సరిపడా స్థలం లేక ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30మంది సిబ్బందితో నడుస్తున్న జిల్లా పరిషత్ ఆఫీస్‌లో కనీసం రికార్డులు దాచిపెట్టడానికి కూడా స్థలం లేకుండాపోయింది. ఒకవైపు పెద్దచెట్లు, కూలిపోయే విధంగా రేకులషెడ్లు అక్కడ దర్శనమిస్తున్నాయి.
జిల్లాలో ఏర్పాటైన ఆరు కొత్త మండలాల్లో సైతం ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక ప్రజలు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఆళ్లపల్లి, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. లక్ష్మీదేవిపల్లి మండలం అయితే అక్కడే స్కూలు.. అందులోనే ఎంపీడీవో కార్యాలయం.. పిల్లలు కూడా ఒక్కోసారి ఆఫీసులోకి వెళ్లిపోతున్నారు. బయట నుంచి ఎవరన్నా వచ్చినా చదువుకునే పిల్లలకు ఇబ్బందిగా ఉంటోంది. చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని తాగునీటి సరఫరా కార్యాలయంలోని రెండు గదుల్లో నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు నానా ఇబ్బందులు పడ్డారు.
పాత పాలకమండలి పదవీకాలం అయిపోయి ఏడాది దాటింది.. అయినా ఇప్పటివరకు ఎన్నికలు కూడా నిర్వహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కొత్త భవనాలు నిర్మిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త పాలకమండలి వచ్చినా పాత భవనాల్లో ఉండాల్సిందేనా అని మాజీ ప్రజాప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం కొత్త జిల్లా, కొత్త మండలాలు ఏర్పాటు చేసి కలెక్టరేట్ కొత్త భవనం అందుబాటులోకి తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చిన్న కార్యాలయాలకు నిధులు మంజూరు చేయలేకపోతున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త మండలాల్లో ఎంపీడీవో, తహసీల్దార్ల కార్యాలయాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏదో చేస్తాం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ కనీసం ప్రభుత్వ ఆఫీసులకు పక్కా భవనాలు కూడా నిర్మించలేకపోతున్నది. జడ్పీ ఆఫీస్కిపోతే కూర్చోడానికి కనీసం స్థలం కూడా లేదు. అన్నీ ఇరుకు గదులే. తాగునీరు ఉండదు. టాయిలెట్స్ మంచిగా ఉండవు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే స్థలం కేటాయించింది కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా భవనం నిర్మించలేదా?
– కొనకుట్ల వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, చండ్రుగొండ మండలం
చుంచుపల్లి ఎంపీడీవో ఆఫీస్ కోసం పక్కా భవనం నిర్మించాలి. ఇన్నాళ్లు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో కార్యాలయం కొనసాగింది. ప్రజలకు పాలన చేరువ కోసం గత సీఎం కేసీఆర్ కొత్త మండలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుత సీఎం కనీసం ఆఫీసులకు కొత్త భవనాలు కూడా నిర్మించలేకపోతున్నారు. నిధులు లేక కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాడి తప్పింది.
– బాదావత్ శాంతి, ఎంపీపీ, చుంచుపల్లి మండలం
జడ్పీ కొత్త భవనం కోసం ఇప్పటికి రెండుసార్లు అంచనాలను తయా రు చేసి నిధుల కోసం పం పించాం. కొత్త మండలాల కోసం కూడా భవనాలకు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే సమస్య ఉండదు. ప్రస్తుతం పాత భవనాల్లోనే విధులు నిర్వహిస్తున్నాం. పాత డీపీవో ఆఫీసు వద్ద స్థలం కేటాయించారు. నిధులు విడుదల కాగానే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– డి.నాగలక్ష్మి, జడ్పీ సీఈవో, భద్రాద్రి కొత్తగూడెం