బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 10 : ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43.2 అడుగులకు నీటిమట్టం చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తర్వాత గంట గంటకూ అడుగు చొప్పున వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. దీంతో సాయంత్రం 5.15 గంటలకు 48 అడుగులకు నీరు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
రాత్రి 7 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను దాటి 48.50 అడుగుల వద్ద గోదావరి ఉరకలు వేస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు పెరుగుతున్న గోదావరికి తోడు.. అటు శబరి వరద కూడా గోదావరికి పోటెత్తింది. ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తడంతో దిగువకు వరద నీరు విడుదల కావడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది.
సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎన్నడూ లేని విధంగా వరద ప్రవాహం గంటకు అడుగు చొప్పున 15 అడుగులు పెరిగినట్లు సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. రాత్రి 11 గంటలకు 49.50 అడుగులకు నీటిమట్టం చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చింతూరు వద్ద శబరి నది గోదావరికి పోటెత్తడంతో సారపాక, భద్రాచలం వద్ద ఆంధ్రా, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలకు వెళ్లే లారీలు, ఇతర వాహనాల రాకపోకలను పోలీసు అధికారులు నిలిపివేశారు.
అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. భద్రాచలం వరద ప్రవాహం అంతకంతకూ పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వరదల విషయంలో అధికారులు 24 గంటలూ మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. వరద పెరిగే ప్రాంతాలను అధికారులు గుర్తించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.