బోనకల్లు, ఫిబ్రవరి 21: నీటి అక్రమ వాడకాన్ని అరికట్టి నాగార్జున సాగర్ జలాలను సాగు పంటలకు అందేలా పర్యవేక్షించాలని బోనకల్లు తహశీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ అధికారులను ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఇరిగేషన్, వ్యవసాయ, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాగునీటి సరఫరాపై ఎమ్మార్వో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీబీసీ కెనాల్ పరిధిలో పంటలు సాగు చేసిన రైతులకు సాగునీటిని అందించాలన్నారు. మండలంలో సుమారుగా 15వేలపై చిలుకు ఎకరాల భూమిలో మొక్కజొన్న సాగు రైతులు సాగు చేశారన్నారు.
వారాబంది వల్ల రైతుల పంట పొలాలకు సాగర జలాలు అందడం లేదని ఆందోళన చెందుతున్నారని బోనకల్లు తహశీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ గుర్తు చేశారు. బీబీసీ పరిధిలోని కలకోట, పోలంపల్లి, లింగాల, నారాయణపురం, ఆళ్లపాడు, ముష్టికుంట్ల మైనర్ మేజర్ కాలువలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ నీటిని రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షణ చేస్తూ సాగునీరు వృధా కాకుండా చూడాలన్నారు.
కాలువల పరిధిలోని చివర ఆయకట్టు భూములకు నీరు సరఫరా జరిగేలా బాధ్యతగా వ్యవహరించాలని బోనకల్లు తహశీల్దార్ అనిశెట్టి పున్నం చందర్ అన్నారు. ఈనెల 24వరకు బీసీ కెనాల్ పరిధిలోని కాలువలకు నీటి సరఫరా అవుతుందని రైతులకు తెలపాలన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ బోనకల్లు బ్రాంచ్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ అధికారి వినయ్ కుమార్, ఆర్ఐ గుగులోతు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.