రఘునాథపాలెం, జూన్ 15: తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని పల్లెల సమగ్రాభివృద్ధిని సాధించాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. పల్లె ప్రగతి వంటి అద్భుత కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా రఘునాథపాలెం మండలంలోని సూర్యాతండా, కొర్లబోడుతండా, పుఠానీతండా, బద్యాతండా, హర్యాతండా, జింకలతండాల్లో గురువారం నిర్వహించిన ‘పల్లెప్రగతి’ దినోత్సవానికి మంత్రి హాజరయ్యారు. నూతన పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. హర్యాతండాలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 17 పంచాయతీలుగా ఉన్న రఘునాథపాలెం మండలాన్ని 37 పంచాయతీలుగా మార్చుకున్నామని, ఇందులో 20 తండాలను పంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నామన్నారు. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున వెచ్చిస్తున్నామని అన్నారు. మూడు నెలల్లోనే పనులను పూర్తి చేసుకొని సర్పంచ్‌లు నూతన కార్యాలయాల వేదికగా పాలన సాగించాలని సూచించారు.
‘పల్లెప్రగతి’తో మారిన రూపురేఖలు
రెండేళ్లుగా గ్రామాల్లో చేపట్టుకుంటున్న పల్లెప్రగతి కార్యక్రమాలతో పల్లెల రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయని మంత్రి అజయ్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలోనే తెలంగాణ పల్లెలు ఎంతో పురోగతిని సాధించాయని అన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఈ నెల 17న జరిగే గిరిజన దినోత్సవంలో భాగంగా మండలంలోని మిగిలిన పంచాయతీల్లో జీపీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులను మంత్రి శాలువాతో సన్మానించారు. శానిటేషన్ పనుల్లో కీలక భూమిక పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు ఉత్తమ సేవా సర్టిఫికెట్లను ప్రదానం చేసి నూతన వస్ర్తాలను అందించి సత్కరించారు. ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, డీఆర్డీవో విద్యాచందన, అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు అప్పారావు, కేవీకే శ్రీనివాస్, విజయకుమారి, తానాజీ, రాజు, అజ్మీరా వీరూనాయక్, మాళోతు ప్రియాంక, భుక్యా గౌరి, కుర్రా భాస్కర్‌రావు, పిన్ని కోటేశ్వరరావు పాల్గొన్నారు.