ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 19 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 7.50 నిమిషాలకే పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సమయానికి పదిహేను నిమిషాల ముందుగానే వచ్చారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై ‘మేమొచ్చిందే టైం’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారితోపాటు ఎంఈవోలు స్పందించారు. వీరితోపాటు ఉపాధ్యాయ వర్గాల్లోనూ చర్చ జరిగింది. డీఈవో సోమశేఖర శర్మ పాఠశాలలను తనిఖీ చేయాలని ఎంఈవోలను ఆదేశించడంతోపాటు ఉపాధ్యాయుల సమయపాలనపై పర్యవేక్షణ ఉండాలని హెచ్ఎంలకు సూచించారు. నగరంతోపాటు పలు మండలాల్లో ఎంఈవోలు పాఠశాలలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు ఏయే సమయాల్లో పాఠశాలలకు వస్తున్నారు? సమ్మెటివ్ పరీక్షలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై ఆరా తీశారు. నగరంలోని నయాబజార్, ఇందిరానగర్ పాఠశాలలను అర్బన్ ఎంఈవో శ్రీనివాస్ తనిఖీ చేశారు.