మన్యానికి మహర్దశ పట్టింది. వైద్యరంగంలో మరో ముందుడుగు పడింది. ఏజెన్సీవాసులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలోకు వైద్య కళాశాల మంజూరు చేసింది. కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించింది. దీంతో జిల్లావాసులు స్థానికంగా వైద్యవిద్యను అభ్యసించే అవకాశం కలిగింది. తాజాగా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయడంతోపాటు 60 మంది విద్యార్థులతో జనవరి నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. గతంలో నర్సింగ్ చదవాలంటే రూ.వేలల్లో ఖర్చు పెట్టి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం స్థానికంగా కళాశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మన్యం సిగలో మణిహారం వచ్చి చేరింది. కొత్తగూడెంలో వైద్య కళాశాల నిర్మాణం పూర్తయింది. గిరిజనులకు వైద్యం మరింత చేరువైంది. దీనిలో భాగంగా నర్సింగ్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. జనవరి నుంచి కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ తరగతులు ప్రారంభంకానున్నాయి. కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తరగతులు ప్రారంభించేందుకు యంత్రాంగంతో ఏర్పాట్లు చేయిస్తున్నారు. ప్రస్తుతం నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేనందున అద్దె భవనంలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లేదు. కాలేజీ ప్రారంభమైతే మొదలైతే ఇక ఇదే మొదటి నర్సింగ్ కాలేజీ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. దీనిలో భాగంగా సర్కార్ దవాఖానల్లో నర్సులను ఎప్పటికప్పుడు రిక్రూట్ చేస్తున్నది. జిల్లాకేంద్రంలో ప్రారంభం కానున్న నర్సింగ్ కళాశాలలో నాలుగేళ్లు పూర్తయ్యేలోపు ఎంతోమంది నర్సింగ్ పూర్తి చేయనున్నారు. వారంతా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఏజెన్సీవాసులకు వైద్యసేవలు అందించనున్నారు. గతంలో నర్సింగ్ చదవాలనుకునే వారు వేలకు వేలు డబ్బులు పోసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు వెళ్లాల్సి వచ్చేది.
నర్సింగ్ మొదటి సంవత్సరంలో చేరేందుకు విద్యార్థులకు డిసెంబర్ చివరి వరకు అవకాశం ఉంది. అప్పటివరకు వెబ్ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. 60 మంది విద్యార్థులతో జనవరి నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని ఒక ప్రైవేట్ భవనం తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. విద్యార్థులకు ప్రభుత్వం హాస్టల్ వసతి కల్పిస్తున్నది. ఇప్పటికే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్ నియమితులయ్యారు. త్వరలో అధ్యాపకులు, సిబ్బంది నియామకం పూర్తి కానున్నది.
ఏజెన్సీ ప్రాంతానికి నర్సింగ్ కాలేజీ కేటాయింపు వరం. రాష్ట్రప్రభుత్వం వైద్యరంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నది. ఆసుపత్రుల్లో ఎప్పటికప్పుడు నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ప్రస్తుతం ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలల్లో నర్సుల అవసరం ఎంతో ఉంది. మిగతా కోర్సుల కంటే నర్సింగ్ పూర్తి చేసిన వారు సత్వరం ఉపాధి పొందవచ్చు.
– పుష్పలత, వైద్యురాలు
మెడికల్ కాలేజీ అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ప్రారంభం కానున్నది. కాలేజీకి ఇప్పటికే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్ నియమితులయ్యారు. త్వరలో అధ్యాపకులు, సిబ్బందిని నియమిస్తాం. విద్యార్థులు డిసెంబర్ చివరిలోపు వెబ్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. జనవరి నెల నుంచి 60 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభం కానున్నాయి. – అనుదీప్, భద్రాద్రి కలెక్టర్