భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 20 (నమస్తే తెలంగాణ): నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి గ్రామసభలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కులగణన సర్వే ద్వారా కొంత సమాచారాన్ని సేకరించడంతోపాటు గత ప్రజాపాలన గ్రామసభల్లో సైతం సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించింది. దీని ఆధారంగా పంచాయతీల్లో కుటుంబ సర్వేను ప్రారంభించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు అర్హులను గుర్తించనున్నారు. ఇందుకోసం మంగళవారం నుంచి నాలుగు రోజులు జరిగే గ్రామసభల్లో అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు. ఇంతచేసినా అర్హులు ఇంకా చాలామంది ఉండనుండడంతో వారికి మొండిచెయ్యి చూపిస్తారా లేక మళ్లీ దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇచ్చి మభ్యపడతారా అనే ప్రచారం జోరుగా సాగుతున్నది. సర్వేలకే పరిమితమైన ప్రభుత్వం ఈ నాలుగు పథకాలను అమలు చేయడం కష్టమేనని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నేటినుంచి నాలుగు రోజులపాటు..
ప్రజాపాలనలో సైతం ప్రతిఒక్కరి వద్ద దరఖాస్తులు స్వీకరించి ఇప్పటికీ వారిలో ఒక్కరిని కూడా అర్హులుగా గుర్తించలేకపోయారు. అదే జాబితా ప్రకారం ఇప్పుడు కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, పింఛను పథకాలను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో అందరికీ ఇస్తారా లేక కొంతమందికే ఇస్తారా అనేది గ్రామసభల్లో స్పష్టత రానుంది. అందరికీ ఇవ్వడం కుదరదు అనే ప్రచారం మాత్రం అందరి నోటా వినబడుతున్నది. జిల్లావ్యాప్తంగా 481 గ్రామ పంచాయతీలతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా గ్రామసభలను నిర్వహించనున్నారు. ఎంపీడీవో, తహసీల్దార్, వ్యవసాయాధికారి, ఎంపీవోలు బృందాలుగా గ్రామాల్లో సభలు నిర్వహించనున్నారు. ఈ సభలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పర్యవేక్షించనున్నారు. ఈ సభల్లో చాలామంది లబ్ధిదారులు పథకాలు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు.
తొలిరోజు 197 చోట్ల గ్రామసభలు..
భద్రాద్రి జిల్లాలో నాలుగు రోజులపాటు జరిగే గ్రామసభల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీపీవో చంద్రమౌళి తెలిపారు. మొత్తం 481 పంచాయతీలకు గాను తొలిరోజు 168 పంచాయతీల్లో, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 29 వార్డుల్లో గ్రామసభలు జరుగనున్నాయి. వీటిని అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఏవో బాబూరావు, జడ్పీ సీఈవో నాగలక్ష్మి పర్యవేక్షించనున్నారు.
కొత్త రేషన్‌కార్డుల కోసం తిప్పలు
చండ్రుగొండ, జనవరి 20: కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డు పొందాలన్నా, ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్పులు, మార్పులు చేసుకోవాలన్నా పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలంటూ కొన్ని గ్రామాల్లో అధికారులు సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. దీంతో చండ్రుగొండ మండలంలోని పలు పంచాయతీ కార్యాలయాల వద్ద సోమవారం ఉదయం నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. ప్రజలు గుంపులుగుంపులుగా వచ్చి దరఖాస్తులు అందజేశారు. అయితే, గతంలో ప్రజాపాలన గ్రామసభల్లోనూ, ఇటీవలి కులగణన సర్వే సమయంలోనూ కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అందజేశామని గ్రామస్తులు అంటున్నారు. మళ్లీ ఇప్పుడు మూడోసారి కూడా దరఖాస్తులు చేసుకోవాలనడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరి గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీస్తున్నారు.