ఖమ్మం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ బుధవారం ఖమ్మం జిల్లా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. మొదటి, రెండోవిడత ఫలితాల్లో జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు జై కొట్టడం ద్వారా మంత్రులకు షాక్ ఇచ్చిన ఓటర్లు మూడోవిడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అప్రతిహత విజయాన్ని అందించి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, సింగరేణి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్ మద్దతుదారులకు గట్టి పోటీ ఇచ్చారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠను కలిగించేలా ఫలితాలు వెలువడ్డాయి.
సింగరేణి మండలంలోని 41 గ్రామ పంచాయతీలకు 6 ఏకగ్రీవం కావడంతో 35 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 1, సీపీఐ 1, స్వతంత్రులు 6 చోట్ల విజయం సాధించారు. ఏన్కూరు మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గాను నాలుగు గ్రామ పంచాయతీల వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. దానిలో నూకాలంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వు కావడంతో గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో అధికారులు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించి ఉప సర్పంచ్‌ను ఎంపిక చేశారు. మిగిలిన 20 గ్రామ పంచాయతీలకు గాను 3 ఏకగ్రీవం కావడంతో 17 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 2, స్వతంత్రులు 1 స్థానంలో గెలుపొందారు.
‘సత్తుపల్లి’లో సత్తా చాటిన ‘సండ్ర’..
సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయవిహారం చేశారు. మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సండ్ర వెంకటవీరయ్య పూర్తిస్థాయి దృష్టి సారించి ప్రతి గ్రామ పంచాయతీలోనూ ప్రచారం నిర్వహించి, పర్యవేక్షణ చేయడంతో పార్టీ ఎదురులేని విజయాన్ని సాధించింది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయంతో గులాబీ పార్టీ గుబాలించింది. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పంచాయతీల్లో బీఆర్ఎస్ పాగా వేసింది.
నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను మూడు మండలాల్లో మెజార్టీ పంచాయతీలను బీఆర్ఎస్ సాధించి కాంగ్రెస్‌ను ఖంగు తినిపించింది. అత్యంత కీలక మండలంగా పేరొందిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కల్లూరులో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. ఎన్నికలు జరిగిన 21 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ కేవలం 5 గ్రామాలకే పరిమితం కాగా బీఆర్ఎస్ 12 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. మరో నాలుగుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. చిన్నకోరుకొండి పంచాయతీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో ఇరు పార్టీల అభ్యర్థులు రీ కౌంటింగ్ కోరారు. రీ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. సత్తుపల్లి మండలంలోనూ బీఆర్ఎస్ మద్దతుదారుల చేతిలో అనేక చోట్ల కాంగ్రెస్ ఓటమి చవిచూసింది.
మండలంలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 21 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం కావడంతో 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెస్ 7 స్థానాలకు పరిమితంకావడంతో బీఆర్ఎస్ 10 స్థానాలను గెలుచుకుంది. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వేంసూరు మండలంలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కట్టి షాక్‌ను ఇచ్చారు. మొత్తం 26 గ్రామ పంచాయతీలకుగాను 3 ఏకగ్రీవం కావడంతో 23 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ పార్టీని 10 స్థానాలకే పరిమితం చేసింది. పెనుబల్లి మండలంలో 32 గ్రామ పంచాయతీలకు 2 ఏకగ్రీవం కాగా 30 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 9, రెండు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది.
అనేకచోట్ల నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ఓట్లు రాబట్టుకుంది. మండల పరిధిలోని భువన్నపాలెంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి 40 ఓట్లు అధికంగా రాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని ఆందోళన చేయడంతో అధికారులు మరోసారి రీకౌంటింగ్ నిర్వహించారు. తల్లాడ మండలంలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు 3 ఏకగ్రీవం కావడంతో 24 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 13, సీపీఎం 1, స్వతంత్ర అభ్యర్థి ఒక్కచోట విజయం సాధించారు. తల్లాడ మండలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా పోరు సల్పాయి. తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ వశమైంది.
కొత్తగూడెం జిల్లాలోనూ బీఆర్ఎస్కు నీరా‘జనం’
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లు గులాబీ పార్టీ (బీఆర్ఎస్)కి నీరాజనాలు పలికారు. అధికార పార్టీ పరువు కోసం ఏకగ్రీవాల ద్వారా సీట్లను కైవసం చేసుకోవడంతోపాటు డబ్బును విచ్చలవిడిగా పంచి ఓటర్లకు గాలం వేసుకున్నారు. దీంతో స్వల్ప తేడాతోనే చాలా స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఓటింగ్ శాతం మాత్రం బీఆర్ఎస్కు బాగానే పెరిగింది. మూడు విడతల్లో జిల్లావ్యాప్తంగా కలిసొచ్చిన పార్టీతో మొత్తంగా 108 సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 267 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఐ కూడా 44 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఐ పొత్తులో ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అని రెండు పార్టీలు తలపడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.
కాంగ్రెస్‌కు తప్పని రెబల్స్ బెడద..
జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పలేదు. దాదాపు పది పంచాయతీల్లో కాంగ్రెస్‌కు ఇద్దరు ముగ్గురు చొప్పున రెబెల్స్ వేసి స్వతంత్రులుగా ఉన్న వారిపై పరాజయం చెందారు. మరి కొన్నిచోట్ల సీపీఐ చేతిలో పరాజయం చెందారు. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో తక్కువ ఓట్లతో సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది.
బీఆర్ఎస్ సంబురాలు..
జిల్లాలో బుధవారం జరిగిన మూడో విడతలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాత్సవాలు చేసుకున్నారు. టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు మండలాల్లో బీఆర్ఎస్ రంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. అధికారం లేకపోయినా అన్నిచోట్ల సత్తాచాటుకోవడంతో కార్యకర్తలు ఊరేగింపులు చేసుకున్నారు.
