బోనకల్లు, మే 7: ఖమ్మం జిల్లా బోనకల్లు రైతువేదికలో అధికారులు గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సభ’ రసాభాసగా మారింది. మొకజొన్న కొనుగోళ్లలో ముమ్మాటికీ ప్రభుత్వానిదే నిర్లక్ష్యమంటూ తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు కలిసి అధికారులను చుట్టుముట్టారు. ప్రగతి ప్రణాళికలు పకన పెట్టి, కల్లాల్లో కునారిల్లుతున్న కర్షకుల కష్టాలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అధికారులకు, రైతులకు మధ్య జరిగిన వాగ్వాదంతో రైతువేదిక దద్దరిల్లింది. మధిర ఏడీఏ స్వర్ణ విజయ్‌చంద్ర, ఎంఏవో వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో బోనకల్లు రైతువేదికలో అధికారులు సమావేశం నిర్వహిస్తుండగా.. తెలంగాణ రైతు సంఘం నేత బొంతు రాంబాబు నేతృత్వంలో పలువురు రైతులు సభలోకి వచ్చారు.
‘మాకు కావాల్సింది ప్రగతి ప్రణాళికలు కాదు.. మొకజొన్న కొనుగోలుకు హామీలు..’ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆ రైతులకు అధికారులు సమాధానం చెప్పలేక ప్రాథేయపడ్డారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని వీరభద్రరావు మాట్లాడుతూ.. మండలంలో 21,332 ఎకరాల్లో మొకజొన్న సాగు చేస్తే.. సుమారు 3.50 లక్షల బస్తాలను కొనుగోలు చేశారని అన్నారు. కానీ, ఇప్పటికీ 83 వేల బస్తాలను కూడా గోదాములకు తరలించలేదని మండిపడ్డారు. ఇంకా 2.60 లక్షల బస్తాలు కల్లాల్లో, పొలాల్లో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, గాలి దుమారాలకు చెల్లాచెదురవుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీపురం సొసైటీ రైతులు సొంతంగా లారీలు కిరాయికి తెచ్చుకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడం సిగ్గుచేటని విమర్శించారు. అయితే, రైతుల ఆందోళన ఉధృతం కావడంతో ఏడీఏ విజయ్‌చంద్ర వెంటనే మార్ఫెడ్ డీఎం శ్యామ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. డీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమావేశాన్ని నడవనివ్వబోమని రైతులు భీష్మించారు. సమావేశం ఎదుట నేలపై కూర్చొని ధర్నా చేశారు. చివరకు డీఎం స్పందిస్తూ.. బోనకల్లుకు వెంటనే 10 లారీలను పంపిస్తామని, మిగిలిన నిల్వలను కూడా యుద్ధప్రాతిపదికన తరలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తమ ఆందోళనను తాతాలికంగా విరమించారు. ఈ హామీని నిలబెట్టుకోకపోతే తహసీల్ ఎదుట మహాధర్నా చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. రైతు సంఘం నేతలు, రైతులు మడిపల్లి గోపాలరావు, దొండపాటి నాగేశ్వరరావు, గుడ్డూరి ఉమ, కొమ్మినేని నాగేశ్వరరావు, తుళ్లూరు రమేశ్, కిలారు సురేశ్, దొండపాటి సత్యనారాయణ, మంద కరుణ తదితరులు పాల్గొన్నారు.