దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ వైద్యులున్నరు.. నాడీ పట్టిన వెంటనే రోగ నిర్ధారణ చేయగల ధీశాలులుగా పేరు గడించారు.. అయితేనేం..! వారందరికీ చేతి నిండా పనిలేదు. వైద్య సేవలనగానే సిద్ధం అంటూ ముందడుగు వేసే నర్సింగ్ స్టాఫ్ కోకొల్లలు. అయినప్పటికీ ఖమ్మం జిల్లాలోని రోగుల ప్రాణాలకు గ్యారంటీ లేదు. కారణం..! తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైద్యశాలలు నీరసించి పోయాయి.
పాలేరు నుంచి పర్ణశాల వరకు కనీస వసతులు కనిపిస్తే ఒట్టు.. వాటి పట్ల కాంగ్రెస్ సర్కారు చూపిస్తున్న సవతి తల్లి ప్రేమ.. గత పదిహేను నెలలుగా నిధుల విడుదలలో జాప్యం కారణంగా ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌కు జీవోలు జారీ చేసినప్పటికీ, వాటిని బయటికి పొక్కనివ్వకుండా ఆటలాడుకుంటున్న ‘హస్తం’ పాలకుల నిర్లక్ష్య వైఖరిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
– ఖమ్మం, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
జిల్లాకో మెడికల్ కాలేజీ, ఊరికో పల్లె దవాఖాన, పట్టణ ప్రాంతాల్లో వాడకో బస్తీ దవాఖాన, కేసీఆర్ కిట్, గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్, కండ్ల జబ్బుల నివారణకు కంటి వెలుగు, జిల్లా దవాఖానల్లో క్యాథ్లాబ్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, కిడ్నీ సంబంధిత సేవలు, న్యూరాలజీ విభాగాలు వంటి ఎన్నెన్నో కీలక సేవలు, పథకాలెన్నో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కనిపించేవి. తెలంగాణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
ఒకనాడు వినిపించిన ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే మాటను పూర్తిగా తుడిచిపెట్టి ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అని రోగులు పరుగులు పెట్టేలా చేశారు. కానీ..! పదిహేను నెలలుగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే పాతరోజులు పునరావృతం అయినట్లుగా కనిపిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో సరైన వసతులు కనిపించక, సేవలు లభించక నిరుపేదలు బిక్కుబిక్కుమంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. సామాన్యులకు జబ్బు చేస్తే దేవుడే దిక్కు అంటూ రోజులు లెక్కబెట్టుకునే దుస్థితి తలెత్తడం వైద్యవర్గాలను కలవరానికి గురిచేస్తున్నది.
వైద్యవిధాన పరిషత్‌లో ఏం జరిగింది..!
జిల్లాలో ఖమ్మంలోని పెద్దాసుపత్రితోపాటు మధిర, సత్తుపల్లి ఏరియా దవాఖానలు, వైరా, కల్లూరు, పెనుబల్లి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రులన్నీ తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉండేవి. వీటిల్లో ఎంతో అనుభవం కలిగిన స్పెషలిస్ట్ వైద్యులు(సివిల్ సర్జన్స్), నర్సింగ్ స్టాఫ్ నిరంతరం విధులు నిర్వహిస్తుండటం, గత బీఆర్ఎస్ సర్కారు నుంచి సంపూర్ణ సహకారం అందడంతో పేదలకు పండంటి ఆరోగ్యం లభించేంది.
జిల్లా ప్రజల, వైద్య విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఖమ్మానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరిక మేరకు, మాజీ సీఎం కేసీఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. ఆ క్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. ఇక్కడ వైద్య విధాన పరిషత్ విభాగంలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ వైద్యులు కలిపి 20 నుంచి 30 మంది, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది దాదాపు 50 నుంచి 70 మంది వరకు బయటికి వెళ్లాల్సి వచ్చింది.
ఆయా పరిస్థితులను ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం వైరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల సామర్థ్యానికి పెంచుతూ జీవో జారీ చేసింది. మధిర, సత్తుపల్లి ఆసుపత్రులను 100 పడకలకు పెంచుతూ ఏరియా దవాఖానలుగా ప్రకటించింది. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, కల్లూరు, పెనుబల్లి, కూసుమంచి, ముదిగొండ, ఎర్రుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసింది.
కనీస వసతుల్లేక తీవ్ర ఇక్కట్లు..
సరిగ్గా పద్నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యరంగం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నది. ముఖ్యంగా వైద్య విధాన పరిషత్ విభాగంపై దృష్టి సారించిన దాఖలాల్లేవు. జిల్లాలోని కీలకమైన మధిర, సత్తుపల్లి ఏరియా దవాఖానల్లో అధునాతన వసతులతో కూడిన భవనాలను గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించినప్పటికీ వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం విస్తు గొలుపుతున్నది.
అదేవిధంగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయడంతోపాటు ఆనాడే నిధులు మంజూరు చేసినప్పటికీ ఇసుమంత పురోగతి లేదు. ఈ ప్రాంత ప్రజలు కీలకమైన వైద్య పరీక్షలు, పోస్టుమార్టం కోసం ఖమ్మం లేదా మధిరకు వెళ్లాల్సి వస్తున్నది. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, పెనుబల్లి ఆసుపత్రులు 50 పడకలతోపాటు 24 గంటలు పనిచేసే విధంగా రూపాంతరం చెందినా కనీస వసతుల్లేక రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి.
వైద్య విధాన పరిషత్‌కు చెందిన ఏ ఒక్క దవాఖానలోనూ అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్‌రే విభాగాలు లేవు. కీలకమైన వైద్య పరీక్షలకు పెద్దాసుపత్రికి చెందిన టీ హబ్ ఒక్కటే దిక్కుగా మారింది. వైద్య పరీక్షలకు అవసరమైన రీ ఏజెంట్స్ కెమికల్స్‌ను సైతం సరఫరా చేయలేకపోవడం హస్తం సర్కారు పని తీరుకు అద్దం పడుతున్నది. గైనకాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, అనస్తీషియా, పాథాలజీ, పిడియాట్రిషన్ తదితర విభాగాలకు చెందిన వైద్యులున్నప్పటికీ వారి సేవలకు అవసరమైన ఆపరేషన్ థియేటర్లు ఎక్కడా లేవు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులే లేవు..
మధిర, సత్తుపల్లి, వైరా, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, పెనుబల్లి ఆసుపత్రులను 24 గంటలు పనిచేసేలా అప్‌గ్రేడ్ చేశారు. వాటిల్లో విధులు నిర్వర్తించేందుకు అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టుల భర్తీ లేదు. ఆయా వైద్యాధికారులుంటేనే 24 గంటలపాటు ఆసుపత్రులు పనిచేసే వీలుంటుంది. అదేవిధంగా మినిస్టీరియల్ స్టాఫ్ నియామకంలోనూ అలసత్వమే కనిపిస్తున్నది. దవాఖానల్లో అనేక రకాల కీలక సమస్యలు కనిపిస్తున్నప్పటికీ, వాటి పరిష్కారం కోరుతూ పలు దఫాలుగా నివేదికలు సమర్పిస్తున్నా కాంగ్రెస్ సర్కారు బుట్ట దాఖలు చేస్తున్నదని సంబంధిత అధికారులు వాపోతున్నారు.
అదేవిధంగా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ గాలిలో దీపంలా మారిన ప్రజారోగ్యాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలో వారివి మాటలు తప్ప కార్యాచరణ కనిపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ‘మార్పు’ అనే మాటను నమ్మి మాయలో పడ్డామని నిరుపేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్ప ఆచరణ ఇకనైనా వైద్యరంగం పట్ల దృష్టి సారించి తమ ప్రాణాలు కాపాడాలని సామాన్య ప్రజానీకం కోరుతున్నది.