ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెరగ్గా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎం బాక్సులను తరలించారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు సమీపంలోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ కళాశాలకు చేరుకొని ఈవీఎంలను మూడంచెల వ్యవస్థ మధ్య భద్రపరచాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ వినీత్‌లు పాల్వంచలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను సందర్శించి.. ఐదు నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియకు ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు 18 టీములను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది.
ఖమ్మం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ సారి భారీగా నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాలో 2018 ఎన్నికల కంటే ఈ సారి పెరిగింది. భద్రాద్రి జిల్లాలో మాత్రం స్వల్పంగా తగ్గింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ఖమ్మం జిల్లాలో 5 గంటలకు పూర్తయింది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో సాయంత్రం 4 గంటలకే ముగించారు. అయితే, అనేక పోలింగ్ కేంద్రాల వద్ద సమయానికి కటే ముందే ఓటు వేయడానికి వచ్చి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లను అధికారులు ఓటింగ్‌కు అనుమతించారు. అనేక గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. కొన్ని చోట్ల ఈవీఎంలు నిదానంగా పనిచేయడం వల్ల కూడా కొంత ఆలస్యమైంది. మధిర, ఖమ్మం, వైరా, పాలేరు నియోజకవర్గాల ఈవీఎం బాక్సులను గురువారం రాత్రికే ఖమ్మంలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించారు.
సత్తుపల్లి ప్రాంతంలోని ఈవీఎంలను శుక్రవారం కౌంటింగ్ కేంద్రానికి చేర్చారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన ఈవీఎం బాక్సులను పరిశీలించి స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచేలా ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో అత్యధిక పోలింగ్ పాలేరు నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ 2,36,287 మంది ఓటర్లు ఉండగా 2,14,810 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం 91.52గా నమోదైంది. ఇక అత్యల్పంగా ఖమ్మం నియోజకవర్గంలో నమోదైంది. ఇక్కడ 3,22,996 మంది ఓటర్లు ఉండగా 2,30,724 మంది ఓటు వేశారు. దీంతో అత్యల్పంగా 71.43 శాతం నమోదైంది. మధిరలో 2,21,326 మంది ఓటర్లుండగా 1,94,615 మంది ఓటుహక్కు వినియోగించుకోవడంతో 87.93 శాతం నమోదైంది. వైరా నియోజకవర్గంలో 1,93,069 మంది ఓటర్లుండగా 1,67,389 మంది ఓటుహక్కును వినియోగించుకోవడంతో 86.70 శాతం నమోదైంది.
సత్తుపల్లి నియోజకవర్గంలో 2,43,118 మంది ఓటర్లుండగా 2,12,549 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 87.43 శాతంగా పోలింగ్ నమోదైంది. గతంలో పోలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం 83.83 శాతంగా నమోదైంది. ఇది బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఈసారి ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతోపాటు ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 86.88 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా కొత్తగూడెంలో 76.42 శాతం నమోదైంది. పినపాక నియోజకవర్గంలో 80.13 శాతం, ఇల్లెందులో 80.54 శాతం, భద్రాచలంలో 79 శాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 80.20 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 81 శాతం పోలింగ్ నమోదుకాగా ఈసారి స్వల్పంగా తగ్గింది.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జనాభాలోనూ, ఓటర్లలోనూ అధిక సంఖ్యలో ఉంటున్న మహిళలు ఓటింగ్‌లోనూ అదేతీరును కనబర్చారు. గురువారం జరిగిన పోలింగ్ వారి శాతమే అధికంగా ఉంది. కాగా, వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడంతో జిల్లాలో 709 మంది ఇంటి నుంచే ఓటు వేశారు. ముఖ్యంగా యువతీ యువకులు, మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. భద్రాద్రి జిల్లాలో 9,66,439 మంది ఓటర్లు ఉండగా 7,75,113 మంది ఓటు వేశారు. అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,55,961 మంది ఓటర్లకుగాను 1,35,501 మంది ఓటు వేశారు. అత్యల్పంగా కొత్తగూడెంలో 2,43,846 మంది ఓటర్లకుగాను 1,86,347 మంది ఓటు వేశారు. జిల్లా వ్యాప్తంగా 80.20 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 4,94,650 మంది మహిళా ఓటర్లు ఉండగా వారిలో 3,94,501 మంది ఓట్లు వేసి 79.75 శాతాన్ని నమోదు చేశారు. ఇతరులు 44 మందికిగాను 25 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.