– ఏదులాపురం అభివృద్ధి ఘనత బీఆర్ఎస్ పార్టీది
– సజీవ సాక్షాలుగా కోట్లాది నిధుల ప్రాజెక్టులు
– కారు గుర్తుకు ఓటేస్తేనే కాంగ్రెస్‌లో మార్పు
– ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 04 : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీతోనే సబ్బండ వర్గాలకు సంక్షేమం సాధ్యపడుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద తండా ప్రాంతం ఎందుగల పలు డివిజన్లో వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామ పుర ప్రముఖుల ఇండ్లకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ 26వ డివిజన్ అభ్యర్థి జ్యోతి, 6వ డివిజన్ అభ్యర్థి వింజం మాలతి, 5వ డివిజన్ అభ్యర్థి బానోత్ మోహన్, 4వ డివిజన్ అభ్యర్థి చీరాల రమణ తదితరుల విజయాన్ని కాంక్షిస్తూ వారు ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుతం కాలనీలలో ఎదుర్కొంటున్న సమస్యలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇంటింటికి అందిన సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఇంటికి విధిగా సంక్షేమ పథకాలు అందాయన్నారు. మధ్య దళారుల బెడద లేకుండా డైరెక్ట్ బెనిఫిషర్ కు పథకాలు అందించిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోవడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను నిలిపి వేసిందని దుయ్యబట్టారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలు వెచ్చించి నాటి ఎమ్మెల్యేగా ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం కేసీఆర్ సహకారంతో రిటర్నింగ్ వాల్, తీగల వంతెన, నర్సింగ్ కాలేజీ, జేఎన్టీయూ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఇలా అనేక విద్యాసంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాబోతుంది.. రాబోతుంది అనే మాటలే తప్పా ఎక్కడా చేతలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులకు ఘన విజయం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని, లేనియెడల పాత పద్ధతిలోనే కొనసాగే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గణ విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, స్థానిక నాయకులు కృష్ణ బానోత్ వీరన్న, బానోత్ మోహన్, పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

Edulapuram Municipality : ‘సబ్బండ వర్గాలకు గులాబీ జెండే ఆధారం’