స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్)తో భద్రాద్రి జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. గణన ఫారాలు నింపే అంశంపై ఓటర్లకు అవగాహన లేకపోవడం, బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) అందరికీ అవగాహన కల్పించకపోవడం వంటి కారణాలతో గణన ఫారాలు నింపే అంశంలో అయోమయం నెలకొంది. ఏదైనా పొరపాటు జరిగితే తమ ఓట్లు పోతాయేమోనంటూ భయాందోళన చెందుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ఫొటోలు దిగుతున్నారే తప్ప ఫారాలు నింపడం అర్థం కాని ఓటర్లకు అవగాహన కల్పించలేకపోతున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, జూలై 7 (నమస్తే తెలంగాణ)
ఎస్ఐఆర్పై జిల్లాస్థాయిలో అధికారులు, గ్రామస్థాయిలో బీఎల్వోలు శిక్షణ పొందారు. కానీ, వారి వద్దకు చేరిన గణన ఫారాలను వారు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు అందజేయలేదు. అయితే, 9,80,000 వరకు గణన ఫారాలను ఇళ్లకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. గ్రామ, పట్టణ ఓటర్లలో ఎవరిని కదిలించినా గణన ఫారాలు తమకు ఇంకా అందలేదని, వాటి కోసమే ఎదురుచూస్తున్నామని అంటున్నారు. కొత్తగూడెం హనుమాన్ బస్తీలో ఇప్పటికీ ఒక్క వీధిలో కూడా మొత్తం ఫారాలు చేరలేదు. లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో కొన్ని ఇళ్లలో మనుషులు ఉన్నా వారికి ఫారాలు ఇవ్వలేదు. పాల్వంచ నవభారత్ గాంధీనగర్‌లో కొన్నిచోట్లకు ఫారాలు చేరలేదు. కొత్తగూడెం జీఆర్బస్తీలో కూడా కొన్ని కుటుంబాలకు ఫారాలు చేరనేలేదు.
అయితే, కొందరు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లకుండా ఎవరో ఒకరి ఇంటి వద్ద కూర్చొని గణన ఫారాలను పంపిణీ చేస్తున్నారని, అందువల్ల సమాచారం తెలియక చాలామంది వాటిని తీసుకోలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. రామవరంలో కూడా ఒక డివిజన్లో కార్పొరేటర్ ఇంటి వద్దనే బీఎల్వో ఉండి అక్కడే ఫారాలు పంపిణీ చేస్తున్నారని, ఫారాలను పూరించడం తెలియని వారి ఫారాలను రాస్తున్నారని అక్కడి నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి స్వాధీనం చేసుకొని ఆన్లైన్లో నమోదు చేయడానికి ఈ నెల 24 చివరి తేదీ అయినప్పటికీ ఇంకా ఫారాల పంపిణీయే పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఎస్ఐఆర్ ప్రక్రియపై గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఎస్ఐఆర్పై ఓటర్ల సందేహాలు నివృత్తి చేసేందుకు భద్రాద్రి జిల్లాలో అధికారులు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశారు. వాటిల్లో ఇద్దరు ఇన్చార్జులను నియమించారు. 1950, 08744-241950 అనే టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రతీ నియోజకవర్గంలో మండలానికి ఒక ఇన్చార్జిని కూడా నియమించారు. అలాగే, 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సూపర్వైజర్ చొప్పున మొత్తం 122 మంది సూపర్వైజర్లను నియమించారు.
2002 నాటి ఓట్లు, ఓటర్ల జాబితా ఎక్కడో?
2002 నాటి ఎస్ఐఆర్ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలను తాజా ఎస్ఐఆర్ గణన ఫారాల్లో నింపాల్సి ఉండడంతో అసలు 2002లో తమ ఓట్లు ఎక్కడున్నాయో, అసలు ఆ జాబితా ఎక్కడుందో, అది తమకు ఎలా చేరుతుందో, దానిని తాము ఎలా పరిశీలించుకొని తాజాగా ఫారాన్ని నింపాలో తెలియక చాలామంది ఓటర్లు గందరగోళ పడుతున్నారు. శిక్షణ పొందిన బీఎల్వోలు కూడా ఈ అంశంపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడం లేదు.
అదీగాక, బీఎల్వోల్లో ఎక్కువమంది అంగన్వాడీ టీచర్లే ఉన్నారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ మీద వారిలో అందరికీ అవగాహన ఉండడం లేదు. అవగాహన లేని వారు మాత్రం ఓటర్లకు అవగాహన కల్పించలేకపోతున్నారు. గణన ఫారాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిన యాప్‌పై కూడా వారికి సరైన లేకపోవడంతో సహాయకులతో పూర్తిచేయించాల్సి వస్తోంది. అలాగే, కొందరు ఓటర్లకు అటు ఆంధ్రాలోనూ, ఇటు తెలంగాణలోనూ ఓట్లు ఉన్నాయి. దీంతో వారివి ఎక్కడి ఓట్లు తొలగించాలో బీఎల్వోలకు అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఆంధ్రాలో ముందుగా మ్యాపింగ్ చేసిన ఓటర్ల వివరాలు ఇక్కడ కన్పించడం లేదని బీఎల్వోలు చెబుతున్నారు.
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: కమల్‌రాజు
బోనకల్లు , జూలై 7: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సూచించారు. మండలంలోని రావినూతల గ్రామంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్వోలు అందించే ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు జాగ్రత్తగా పూర్తిచేయాలని సూచించారు. ప్రతీ బూత్ పరిధిలోని బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నాయకులు ఫారాలను పూర్తి చేసే బాధ్యతలను చేపట్టాలని సూచించారు. అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు చేబ్రోలు మల్లికార్జునరావు, బానోత్ కొండ, వేమూరు ప్రసాద్, పారా ప్రసాద్, కొమ్మినేని ఉపేందర్, మూడావత్ సైదా, తన్నీరు పుల్లారావు, బెజవాడ మల్లికార్జునరావు, సత్యనారాయణ, కంచర్ల బాబు, గణపతి, వెంగళ కనకయ్య, షేక్ పెంటు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎస్ఐఆర్: ఖమ్మం కలెక్టర్ దివాకర
ఎర్రుపాలెం, జూలై 7: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని, పార్టీల సహకారంతో అర్హులైన ప్రతీ ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పార్టీల ప్రతినిధులు తమ వద్ద ఉన్న ఓటర్ల వివరాలను సంబంధిత బీఎల్వోలకు అందజేసి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిషరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తహసీల్దార్ కె.సునీత ఎలిజబెత్, ఆర్ఐలు రవికుమార్, శ్రీషా తదితరులు పాల్గొన్నారు.

ఎవరి ఓట్లూ పోవు.. ఎక్కడికీ పోవు..
ప్రతి ఇంటికీ ఓటరు గణన ఫారాలు వస్తాయి. బీఎల్వోలు, సూపర్వైజర్లు, ఏఈఆర్‌లు, ఈఆర్వోలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు గణన ఫారాలను అందజేస్తారు. ఆ ఫారాలు అందిన వారు 2002 నాటి తమ, తమ కుటుంబ సభ్యుల వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి తిరిగి బీఎల్వోలకు అందజేయాలి. 2002 నాటి వివరాలు లేకపోయినా తాజా వివరాలు పూర్తిచేసి సంబంధిత పత్రాలను జత చేసి ఇచ్చినా సరిపోతుంది. ఎవరి ఓట్లూ పోవు. ఎక్కడికీ పోవు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశాం.
-రంగా ప్రసాద్, ఎన్నికల సూపరింటెండెంట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
నాకు ఇంతవరకు ఫారం చేరలేదు..
నాది కొత్తగూడెం జీఆర్ బస్తీ. ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఇంతవరకు నాకు ఓటరు గణన ఫారం చేరలేదు. అసలు ఇస్తారో లేదో కూడా తెలియడం లేదు. చాలామందిని అడిగాను. వారంతా వారికి ఫారం అందినట్లు చెబుతున్నారు. కానీ, నాకు మాత్రం అందలేదు. ప్రతిసారీ ఇంటి వద్దనే ఉండము కదా. అత్యవసర పనిమీద ఊరికి వెళితే మా పరిస్థితి ఏమిటి? ఫారాలు ఇచ్చేందుకు మళ్లీ వస్తారో రారో కూడా తెలియడం లేదు.
-అంజయ్య, జీఆర్ బస్తీ, కొత్తగూడెం
మా ఇంటికి ఎవరూ రాలేదు..
మాది పాల్వంచ నవభారత్. మా ఇంటికి ఎవరూ రాలేదు. గణన ఫారం కూడా ఇవ్వలేదు. నేను ఉండేది కలెక్టరేట్ దగ్గర్లో. అక్కడ షాపు పెట్టుకున్నాను. మా ఇంటికి ఎవరైనా వచ్చి ఫారం ఇచ్చారా? అంటూ నిత్యం ఫోన్ చేసి ఇరుగూ పొరుగు వారిని వాకబు చేస్తున్నాను. ఎవరూ రాలేదని వారు చెబుతున్నారు. మరి నాకు గణన ఫారం ఇచ్చేందుకు అధికారులు ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. అయితే, ఫారం ఎక్కడిస్తారో చెప్పినా నేనైనా వెళ్లి తెచ్చుకుంటాను.
-తాటి వసంత, నవభారత్, పాల్వంచ