భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తి కానున్నదని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల ఎంపీడీవోలు తమ కార్యాలయాల్లో ఆన్లైన్ చేస్తున్నారని పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,33,225 దరఖాస్తులు రాగా.. వాటిలో 3,14,583 ఆన్లైన్ చేశామన్నారు. మొత్తంగా 94 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. అత్యధికంగా అశ్వాపురం, భద్రాచలం, కరకగూడెం, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో వంద శాతం పూర్తయ్యాయన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 57,823 దరఖాస్తులు రాగా.. అందులో 54,582 ఆన్లైన్ అయినట్లు తెలిపారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా మరోసారి ఆపరేటర్లు వెరిఫికేషన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.