ఎర్రుపాలెం, అక్టోబర్ 11: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న వేడుకలు శుక్రవారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా నిత్య పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడి మండపంలోని జగన్మాత.. మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సామూహిక చండీహోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. మహా అన్నదాన కార్యక్రమంలో భాగంగా 350 మందికి స్వామివారి అన్నప్రసాదం అందించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ పర్యవేక్షకులు కే.విజయకుమారి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్యఅర్చకులు మురళీమోహన్శర్మ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, అక్టోబర్ 11: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పిండిప్రోలులో శుక్రవారం అమ్మవారి మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు భక్తులు కనకదుర్గమ్మ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
పెనుబల్లి, అక్టోబర్ 11: అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్లూరులోని పుల్లయ్యబంజర వీధిలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద ఆయన పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుమ్మలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం ఉషాచౌదరి, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, పసుమర్తి చంద్రరావు, కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
మధిర, అక్టోబర్ 11: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజలకు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు సహా పలువురు నాయకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, కటికల సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, అక్టోబర్ 11: మండలంలోని బస్వాపురం గ్రామంలో శరన్నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీకనకదుర్గా అమ్మవారి ఆలయంలో లింగగూడెం గ్రామ మాజీసర్పంచ్ నామా రమేశ్, వెంకయ్య, వెంకటరమణ సోదరులు శుక్రవారం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, నాయకులు నల్లమోతు లక్ష్మయ్య, యలమందల మధు, తూము అప్పారావు, మద్దిన్ని భద్రయ్య, వింజం సుగుణమ్మ, చోడవరపు నర్సింహారావు, చల్లా భాస్కర్, రవికుమార్, ఓరుగంటి రవి, సముద్రాల ఎల్లారావు, తాటిపల్లి సతీశ్, భోగిన్ని రాంబాబు, సముద్రాల ఎల్లారావు, పాల్గొన్నారు.