ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 25: మేకలు అపహరించడానికి వచ్చి ఓ దుండగుడు వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని కోదాడ క్రాస్రోడ్లో వెలుగుచూసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డులోని ఎన్నెస్పీ కాలువ పక్కన చిన్న గుడిసెలో షేక్ జాన్బీ (65) అనే వృద్ధురాలు మేకలు, కోళ్లు పెంచుతూ జీవిస్తున్నది. గురువారం రాత్రి ఓ దుండగుడు గుడిసెలోకి వచ్చి వృద్ధురాలిని గొంతుకోసి హతమార్చి మేకలను అపహరించి ఉడాయించాడు. శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న కుమారుడు బాబూమియా, బంధువులు ఘటనా స్థలానికి వచ్చారు. మధ్యాహ్నం నిందితుడు ఖమ్మం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో మేకలను విక్రయిస్తుండగా బాబూమియాకు పరిచయస్తులైన గుంజా రాంబాబు, సాయిలు గుర్తించారు. వెంటనే నిందితుడిని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా మేకల చోరీ, వృద్ధురాలి హత్య వెలుగులోకి వచ్చింది. నిందితుడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని వెల్లంద గ్రామానికి చెందిన పర్వతం వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.