భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : సారూ మా సమస్యలను మీరన్నా తీర్చాలంటూ ప్రజావాణిలో ప్రజలు కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రతిఒక్కరి సమస్యను విని, వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యను సమయం తీసుకుని వినడంతో ప్రజావాణి సాయంత్రం వరకు కొనసాగింది. సమస్యలపై వెంటనే విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు మధు, దామోదర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సికిల్ సెల్ అనీమియా వ్యాధిని శాశ్వతంగా నివారించేందుకు ఈ నెల 19 నుంచి జూలై 3వ తేదీ వరకు ట్రైబల్ ఏరియాలోని గిరిజనులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ జాయింట్ సెక్రెటరీ జయ అన్నారు. సోమవారం న్యూ ఢిల్లీ నుంచి ఆమె జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి ఆదివాసీ గిరిజనులకు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే తప్పనిసరిగా చికిత్స అందించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 50 ఆశ్రమ పాఠశాలలు, 23 పీఎంహెచ్ హాస్టళ్లు, 30 వసతిగృహాల్లోని గిరిజన విద్యార్థులకు, ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ప్రజలకు టెస్టులు నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్‌నాయక్, డీపీవో చంద్రమౌళి, అదనపు డీఆర్డీవో రవి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. వీవీ ప్యాడ్స్‌లో స్లిప్పుల తొలగింపు, అడ్రస్ బాక్స్, థర్మల్ పేపర్స్ రిమూవల్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈవీఎం, వీవీ ప్యాట్ నిల్వ ఉంచిన గోడౌన్ వద్ద నిరంతరం పటిష్ట భద్రత కొనసాగించాలని సూచించారు. గోడౌన్ పక్కన ఉన్న పాత బిల్డింగ్‌ను పూర్తిగా తొలగించి ఆ ప్రదేశంలో ఎన్నికల ప్రక్రియ సమయంలో కావాల్సిన షెడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆయన వెంట ఎన్నికల విభాగం అధికారులు దారా ప్రసాద్, రంగ ప్రసాద్, తహసీల్దార్ పుల్లయ్య ఉన్నారు.
భద్రాచలం, జూన్ 24 : వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనులు తమ సమస్యలపై భద్రాచలం ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్‌కు సోమవారం దరఖాస్తులు సమర్పించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్భార్‌లో ఇన్చార్జి పీవో జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు గిరిజనుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. తన పరిధిలో ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ.. మిగతా వాటిని యూనిట్ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా పోడు భూములు, వ్యక్తిగత, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాల కొరకు, పట్టా భూములకు రైతుబంధు తదితర అంశాలకు సంబంధించిన వాటిపై దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు. వీటిని ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అలాగే ఒంటరి, వితంతు మహిళ పింఛన్ల కోసం, కులాంతర వివాహాలకు సంబంధించిన ప్రోత్సాహకాల కోసం గిరిజనులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, గురుకుల ఆర్సీ వెంకటేశ్వరరాజు, ఏపీవో పవర్ మునీర్‌పాషా, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, జేడీఎం హరికృష్ణ, ఇతర యూనిట్ అధికారులు పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, జూన్ 24 : ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, త్వరితగతిన పరిషరించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిషార నిమిత్తం ఆదేశిస్తూ సంబంధితశాఖల అధికారులకు అందజేశారు. అనంతరం అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీఎంవో ప్రజావాణి దరఖాస్తులు జిల్లాలో వివిధశాఖలకు సంబంధించి 328 పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి యుద్ధప్రాతిపదికన పరిషార చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో ఎం.రాజేశ్వరి, జడ్పీ సీఈవో వినోద్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, వసతిగృహాల నిర్వహణ మెరుగ్గా చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమశాఖల అధికారులు, ఆర్సీవోలు, వసతిగృహ, గురుకులాల ప్రిన్సిపాళ్లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత, వసతి, భోజన సదుపాయాల్లో ఎకడ లోపాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. వసతిగృహాలు, గురుకులాల్లో గతంలో మిగిలిన కిరాణా సరుకులు తీసి, తాజా సరుకులు వాడాలని తెలిపారు. మెనూ కచ్చితంగా పాటించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం, కూరలు, పండ్లు, గుడ్లు అందజేయాలన్నారు. నాణ్యతా లోపాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. త్వరలోనే కలెక్టర్, అదనపు కలెక్టర్లు తనిఖీలు చేపడతారని, నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమీక్షలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.జ్యోతి, సంక్షేమశాఖల ఆర్సీవోలు, వసతిగృహాలు, గురుకులాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.