‘1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమై ప్రజాస్వామిక స్వేచ్ఛకు బాటలు వేసింది.. ప్రజలను అభివృద్ధి బాట పట్టించింది.. అమరుల త్యాగ ఫలమే నేటి తెలంగాణ.. వారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి..’ అని వక్తలు పేర్కొన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. నాటి ఉద్యమకారుల పోరాటాలను గుర్తు చేశారు.
– నెట్వర్క్
కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 17: జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదవారం కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వినీత్ గంగన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం దేశంలో విలీనమైన రోజు అందరికీ శుభదినమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ విజయ్‌బాబు, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏవో జయరాజు పాల్గొన్నారు.