కాంగ్రెస్ సర్కారులో రేషన్ డీలర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. గత కేసీఆర్ సర్కారులో ప్రతి నెలా ఠంఛన్‌గా వచ్చిన రేషన్ డీలర్ల కమీషన్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలల తరబడి పెండింగ్‌లో ఉంటోంది. దీంతో కమీషన్ కోసం డీలర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. కమీషన్‌ను క్రమం తప్పకుండా విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. గడిచిన ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి కమీషన్ విడుదల కాకపోయినా పట్టించుకునే అధికారులు గానీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గానీ లేరు. ఫలితంగా రేషన్ డీలర్లు ‘కమీషన్ విడుదల చేయించండి మహాప్రభో’ అంటూ వేడుకుంటున్నారు.
-ఖమ్మం, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.. ఆ సన్న బియ్యం పంపిణీ చేసే రేషన్ డీలర్లకు మాత్రం కమీషన్‌ను సక్రమంగా విడుదల చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 748 రేషన్ షాపులున్నాయి. ఆయా షాపుల ద్వారా ప్రతి నెలా 5 లక్షల మందికి పైగా కార్డుదారులకు క్రమం తప్పకుండా డీలర్లు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
అయితే, ప్రభుత్వం రేషన్ డీలర్లకు క్వింటాకు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తుంది. గతంలో ఏప్రిల్, మే నెలలకు కమీషన్‌ను ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఈ క్రమంలో జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసింది. దీంతో మొత్తం ఐదు నెలల కమీషన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబర్‌లో మరోసారి మూడు నెలల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది.
అయితే, ఆ సమయం కూడా దగ్గర పడుతున్నప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల కమీషన్‌ను విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో డీలర్‌కు పెండింగ్‌లో కమీషన్ మొత్తం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అందాల్సి ఉంది. పంపిణీ సమయంలో అయ్యే ఖర్చులను ముందుగా రేషన్ డీలర్లే భరిస్తున్నారు. ఆ తరువాత కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు. తాజా కమీషన్‌ను కూడా ఐదు నెలలుగా పెండింగ్ పెట్టడంపై డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హామీకి మంగళం?
అయితే, తాము అధికారంలోకి వస్తే కమీషన్‌కు క్వింటాకు రూ.300కు పెంచుతామని గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అంతేగాక గౌరవ వేతనంగా మరో రూ.5 వేలు కూడా ఇస్తామంటూ మ్యానిఫెస్టోలోనూ ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో ‘ఆ హామీని తుంగలో తొక్కిందా? లేక ఆ హామీకి మంగళం పాడిందా?’ అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
భారంగా షాపుల నిర్వహణ
రేషన్ షాపుల నిర్వహణలో డీలర్లపై తీవ్రమైన భారం పడుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం తెచ్చుకున్నప్పుడు హమాలీల ఖర్చులు, లారీ డ్రైవర్ ఖర్చులు మొదలుకొని.. షాపుల అద్దెలు, విద్యుత్ బిల్లులు, బియ్యాన్ని లబ్ధిదారుల సంచుల్లో పోసేందుకు అవసరమయ్యే కూలీల ఖర్చులవంటివన్నీ డీలర్లే భరిస్తున్నారు. అవన్నీ కలుపుకొని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో డీలర్‌కు ప్రతి నెలా రూ.15 వేల వరకు వస్తోంది. దీంతో ప్రభుత్వం చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని రేషన్ డీలర్లు ప్రతి నెలా ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు.
రేషన్ డీలర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు..
ఐదు నెలలుగా కమీషన్ విడుదల చేయకపోవడంతో రేషన్ డీలర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఏ నెలకు ఆ నెల కమీషన్ మొత్తం డీలర్ల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు కమీషన్ కోసం డీలర్లు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలి. ఐదు నెలల పెండింగ్ కమీషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్ పాటిస్తాం.
-బానోతు వెంకన్న, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
కమీషన్‌ను పెండింగ్ పెట్టడం సరైంది కాదు..
చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న మాకు ప్రభుత్వం కమీషన్‌ను పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదు. ప్రతి నెలా సక్రమంగా డీలర్లకు కమీషన్ విడుదల చేయాలి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కమీషన్ ఒకేసారి డీలర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. కానీ, ఇప్పుడు కేంద్రం కమీషన్ ఒకసారి, రాష్ట్రం కమీషన్ మరోసారి విడుదలవుతున్నాయి. దీంతో అవి కూడా చెల్లింపులకు సరిపోవడం లేదు.
రేషన్ షాపుల నిర్వహణలో ఆర్థిక భారం ఎక్కువవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.140 కమీషన్ గిట్టుబాటు కావడం లేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా రూ. వేల గౌరవ వేతనం, రూ.300 కమీషన్ ఇవ్వాలి. దీనిపై త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. ఆగస్టు నెల వరకు కమీషన్ విడుదల చేయకపోతే జిల్లాలోని రేషన్ డీలర్లతో చర్చించి సెప్టెంబర్ నెల రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం పంపిణీని నిలిపివేస్తాం.
– గోళ్ల మురళి, రేషన్ డీలర్ల సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి