ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గి మంచి కొలువు సాధించాలన్నా, కొలువు సాధించాక కెరీర్లో రాణించాలన్నా ఆంగ్లంపై పట్టు ఎంతో అవసరం.. అందుకు ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులకు 20 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మరో 80 మార్కులకు థియరీ పరీక్ష ఉంటుంది. ఈసారి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ ప్రాక్టికల్స్‌కు హాజరవుతారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉభయ సంవత్సర విద్యార్థులూ హాజరు కావాల్సి ఉంటుంది.
– అశ్వారావుపేట, జూలై 30
అశ్వారావుపేట, జూలై 30: ఇంటర్మీడియట్ దశలోనే విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌పై ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు 80 మార్కులకు ‘థియరీ’ పరీక్ష రాయనున్నారు. మిగిలిన 20 మార్కులకు ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నెగ్గుకు రావాలంటే ఆంగ్లంపై పట్టు ఎంతో అవసరం. సరైన విద్యార్హత ఉండి ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలిగి ఉంటే భవిష్యత్తులో యువతను ఎన్నో ఉపాధి అవకాశాలు వరించనున్నాయి.
ఆంగ్లంపై మక్కువ పెంచేలా..
కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టులను జటిలమైన సబ్జెక్టులుగా భావిస్తారు. వాటిలో కనీసం పాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటారు. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు. ఇక ఆ సబ్జెక్ట్‌పై వారికి ఎల్లప్పుడూ కంటగింపే. అలాంటి సబ్జెక్ట్‌ల్లో ఆంగ్లమూ ఒకటి. విద్యార్థులు ఆంగ్లంపై మక్కువ పెంచుకునేలా బోర్డు ప్రాక్టికల్ విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో బైపీసీ, ఎంపీసీతోపాటు ఇతర వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. ఇక నుంచి ఫస్టియర్ నుంచే ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయి. అయితే.. ఈ సంవత్సరం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉండవు. ఈ విద్యాసంవత్సరం ఫస్టియర్ చదువుతూ వచ్చే విద్యాసంవత్సరంలో సెకండియర్ చదివే వారికి మాత్రం ప్రాక్టికల్స్ ఉంటాయి. తర్వాత ఏటా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కొనసాగుతాయి.
జిల్లాలో 49 కాలేజీలు..
జిల్లావ్యాప్తంగా 49 జూనియర్ కళాశాలలు ఉండగా వీటిలో ప్రభుత్వ కాలేజీలు 14, ప్రైవేట్ కళాశాలలు 35. వీటి పరిధిలో సుమారు 13,500 మంది వివిధ గ్రూప్‌ల్లో ఫస్టియర్ చదువుకుంటున్నారు. ఈ ఏడాది నుంచి వీరంతా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో పాల్గొనాల్సి ఉన్నది. వీరిలో ఈ నెల 25లోపు ప్రభుత్వ కాలేజీల నుంచి 2,143 మంది, ప్రైవేటు కళాశాలల నుంచి 2,565 మంది ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు హాజరుకావాల్సి ఉన్నది.
ప్రాక్టికల్స్ విధానం ఇలా..
ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ఎప్పటి నుంచో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇక నుంచి అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.
ఆంగ్లంపై పట్టు కోసమే..
ఇప్పటివరకు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే భౌతిక, రసాయనిక, జీవ, వృక్ష శాస్ర్తాల్లో ప్రాక్టికల్స్ ఉండేవి. విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించేందుకు మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్లం అనర్గళంగా మాట్లాడడం ఎంతో అవసరం. అంగ్లంపై పట్టు సాధిస్తే విద్యార్థులు చిన్న వయస్సులోనే మంచి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది.
– బేరి సులోచనారాణి, డీఐఈవో, కొత్తగూడెం