అశ్వారావుపేట సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సుమారు ఐదు నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు సాగదీస్తున్నారు. ఈక్రమంలో అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.15 లక్షలకు రాజీ కుదిరిందని, అతిత్వరలోనే సస్పెండైన ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సొసైటీ డైరెక్టర్లు కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ అవినీతి, విచారణాధికారులపైనా సమగ్ర విచారణ కోరుతూ ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవినీతి అధికారులను కాపాడేందుకు ఉమ్మడి ఖమ్మంజిల్లా అధికారితోపాటు ఒక మంత్రి సమీప అనుచరుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సైతం ఆరోపణలు వినిపిస్తున్నాయి.
-అశ్వారావుపేట, మార్చి 22
వ్యవసాయాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం సేవలందించే అశ్వారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో రూ.61 లక్షల అవినీతి జరిగింది. సొసైటీలో జరిగిన అవినీతిపై గత ఏడాది జూలై నెలలో ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఈ దశలో అక్రమాలు, అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ సమయంలో కేవలం రూ.6 లక్షలు దుర్వినియోగమైనట్లు గుర్తించిన అధికారులు చెల్లించాలని సీఈవోను ఆదేశించారు. అందుకు ససేమిరా ఒప్పుకోలేదు.
దీనికితోడు ఇతర ఫిర్యాదులతో ఏకంగా సహకార చట్టంలోని 51 ఎంక్వైరీకి ఆదేశించారు. సెప్టెంబర్ 17న సీఈవోను సస్పెన్షన్ చేశారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు పూర్తిస్థాయి విచారణ జరిపి ఏకంగా రూ.61 లక్షలు నిధులు దుర్వినియోగం, అక్రమాలు జరిగినట్లు తేల్చారు. తుది నివేదికను నవంబర్ 15వ తేదీన విచారణాధికారి డీసీవోకు అందజేశారు. అక్రమాల్లో ఆఫీస్ అసిస్టెంట్ భాగస్వామ్యం కూడా ఉందని అతడిని ఫిబ్రవరి 23న సస్పెన్షన్ చేశారు. విచారణ పూర్తై సుమారు 5 నెలలు గడుస్తున్నా తదుపరి చర్యలు తీసుకోవటంలో ఉన్నతాధికారులు మిన్నకుండటంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు..
ప్రాథమిక విచారణ అనంతరం అవినీతిని వెలుగులోకి తెచ్చిన అధికారులు తదుపరి చర్యలు తీసుకోవటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రూ.20 లక్షలలోపు అవినీతి జరిగితే రికవరీ చేసే అవకాశం ఉంది. కానీ అంతకంటే ఎక్కువ నిధులు దుర్వినియోగమైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు తుది విచారణ సాకుతో తాత్సారం చేస్తున్నారు. విచారణ నివేదిక వచ్చిన 2నెలల్లోనే పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అవినీతికి పాల్పడిన వారికి సంజాయిషీ ఇచ్చేందుకు అడిగినంత సమయం కేటాయిస్తూ కాలయాపన చేస్తున్నారు.
దీనివెనుక అంతర్యం ఏమిటో అర్థంకాక పాత పాలకవర్గం, రైతులు చెవులు కొరుక్కుంటున్నారు. సొసైటీ అవినీతిని మరుగునపడేసి బాధ్యులకు తిరిగి పోస్టింగ్ ఇచ్చేలా రూ.15 లక్షలకు రాజీ కుదిరినట్లు గుసగుసలాడుతున్నారు. జరిగిన అవినీతిలో నిర్ధారించిన రూ.61 లక్షల్లో సుమారు రూ.25 లక్షలను సడలించేందుకు విచారణాధికారిపైనా తీవ్ర వత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. తద్వారా అవినీతి ప్రభావం తగ్గించి అవినీతిపరులకు మేలుచేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అశ్వారావుపేట మండలం నారాయణపురం సొసైటీలో కేవలం రూ.7 లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు విచారణలో నిర్ధారించిన అధికారులు అతడిని 2021లో సస్పెన్షన్ చేశారు. ఇప్పటివరకు అతడికి పోస్టింగ్ ఇవ్వలేదు. కానీ భారీ అవినీతికి పాల్పడిన అశ్వారావుపేట సొసైటీ అధికారులపై ఇంకా తుది చర్యలు లేకపోవడం గమనార్హం.
రైతులకు సొసైటీ సేవలు దూరం..
జిల్లా ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో రైతులకు సొసైటీ సేవలు అందడం లేదు. ‘పేట’ సొసైటీలో ఇద్దరు అధికారులు సస్పెండ్కావడంతో డీసీసీబీ సూపర్వైజర్ సుందర్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ అతడికి డీసీవో ఇచ్చిన ఆదేశాలు చెల్లవని, ఖమ్మం డీసీసీబీ సీఈవో అనుమతి ఉండాలని సహకార సంఘం చట్టం స్పష్టం చేస్తోంది. దీంతో ఇన్చార్జ్ అందుబాటులో లేకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపైనే భారమంతా పడుతోంది. సీనియర్ ఆడిటర్ రాజశేఖర్‌రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించినప్పటికీ ఆయన సొంత విధుల్లో బిజీగా ఉండటంతో స్థానిక రైతులకు సొసైటీ సేవలు దూరమవుతున్నాయి.
త్వరలో ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం..
‘పేట’ సొసైటీలో రూ.61 లక్షలకు పైగా అవినీతి జరిగింది. ఇద్దరు అధికారులను సస్పెన్షన్ చేశారు.. కానీ తుది చర్యలు తీసుకోకుండా జిల్లా ఉన్నతాధికారులు తాత్సారం చేస్తున్నారు. రూ.15 లక్షలకు రాజీ కుదుర్చుకొని అవినీతి మచ్చను తుడిచేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ కోరుతూ ఏసీబీ అధికారులకు త్వరలో ఫిర్యాదు చేస్తాం. ఏసీబీ వారిని ఇప్పటికే సంప్రదించాం.
– బత్తిన పార్థసారథి, సొసైటీ మాజీ డైరెక్టర్, అశ్వారావుపేట
ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి..
సొసైటీలో అవినీతి జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేటతెల్లమైంది. ఇందుకు బాధ్యులైన సీఈవో, ఆఫీస్ అసిస్టెంట్లను సస్పెన్షన్ కూడా చేశారు. రూ.61 లక్షలను రూ.1.50 వడ్డీతో సహా చెల్లించాలని బాధ్యులను ఆదేశించాం. రూ.15 లక్షలకు రాజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బాధ్యులపై నెలరోజుల్లో పూర్తిస్థాయి చర్యలు ఉంటాయి. రైతులు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు.
– శ్రీనివాసరావు, డీసీవో, కొత్తగూడెం