ఖమ్మం అర్బన్, మే 25 : ఉపాధ్యాయులకు అందిస్తున్న వృత్యంతర శిక్షణ వారికి చుక్కలు చూపిస్తున్నది. శిక్షణ అందిస్తున్న కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల వసతులు కల్పించి.. మరికొన్నిచోట్ల కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు బాహాటంగా విమర్శించడంతోపాటు ఫిర్యాదులు సైతం చేశారు. ఇప్పటివరకు పూర్తయిన మొదటి, రెండో విడత శిక్షణల్లో టీచర్లు పడరానిపాట్లు పడ్డారు. కూర్చునేందుకు సౌకర్యంగా లేని బెంచీలు, టాయిలెట్స్ సమస్యతో మహిళా ఉపాధ్యాయులు శిక్ష అనుభవించారు.
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మండలానికి చెందిన ఉపాధ్యాయులకు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కల్పించిన శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు. విద్యార్థినుల టాయిలెట్స్‌ను వారికి కేటాయించడంతో కొంతపెద్ద వయస్సు, ఆరోగ్యం సహకరించని ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఎండల వేడికి తాళలేక, సరైన తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేక వాట్సాప్ గ్రూపుల్లో శిక్షణకు హాజరుకాలేమని తమ గోడు వెలిబుచ్చారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణలో అత్యధిక మంది ఉపాధ్యాయులు సౌకర్యాలు లేక సతమతమయ్యారు.
ఐదురోజులు పూర్తయిన వారికే సర్టిఫికెట్లు..
శిక్షణలో ఐదురోజులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికే హాజరు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. స్టేట్‌లో ట్రెజరీ ఐడీ, జిల్లాసాయిలో కేంద్రాల్లో తీసుకున్న హాజరును సరిపోల్చనున్నారు. ఇందుకు శనివారం నిర్వహించిన జూమ్‌లో మార్గదర్శకాలు చేశారు. హాజరును డీఎస్‌ఈకి పంపించాలని స్పష్టం చేశారు. ఒక్కరోజు హాజరు కాకపోయిన సర్టిఫికెట్ రాదు. అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రం డీఈవో పర్మిషన్ ఇచ్చారు. కొంతమందికి ఇతర ఫేజ్‌ల్లో శిక్షణకు అవకాశం ఇచ్చిన సుమారు వంద మందికిపైగా హాజరుకానున్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. జిల్లాలో మొత్తం అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్స్ 2,774, ఎంఆర్పీలు 168, జీహెచ్ఎంలు 185, స్పెషల్ ఎడ్యుకేటర్స్ 32, ఐఈఆర్పీలు 30, ఎస్జీటీలు 2,087 మంది ఉన్నారు.
నేటినుంచి మూడో విడత..
ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు చివరి విడత శిక్షణ నిర్వహించనున్నారు. ఇందుకోసం 5 కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో మూడు ప్రైవేట్ స్కూల్స్ కాగా.. మరో రెండు ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. హార్వెస్ట్, న్యూఇరా, న్యూవిజన్ ప్రైవేట్ స్కూల్స్, ఇందిరానగర్, రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కేంద్రాలుగా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్‌లో కొందరికి ఏసీ సౌకర్యం కల్పిస్తుండగా.. మరికొందరికి ఏసీ సౌకర్యం లేదు. వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలియనిది కాదు. ట్రైనింగ్ అంటేనే అమ్మో అంటున్నారు.
ప్రధానోపాధ్యాయులు, తెలుగు సబ్జెక్ట్ వారికి న్యూఇరా పాఠశాలలో, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్ వారికి హార్వెస్ట్‌లో, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు న్యూవిజన్లో, హిందీ వారికి ఇందిరానగర్ స్కూల్లో, ఎస్జీటీ ఉర్దూ వారికి రిక్కాబజార్ స్కూల్లో శిక్షణ కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల్లో ఇన్చార్జి ఎంఈవోలుగా ఉన్నవారు, ఎంఈవోలు హైదరాబాద్‌లో ఎంఈవోల శిక్షణకు హాజరుకానున్నారు.