ఆలస్యమైనా అంచనాలకు మించి వర్షం కురిసింది. వానకాలం, యాసంగి పంటలు పుష్కలంగా పండేలా జలాశయాలను నింపింది. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు, జర్వాయర్లు, చెరువులు, కుంటలను నిండు కుండలను చేసింది. మిషన్ కాకతీయ పథకం కింద అభివృద్ధి చేసినచెరువులు జలకళను సంతరించుకునేలా చేసింది. భూగర్భ జలాల అభివృద్ధికి తోడ్పాటునందించింది. వరుసగా కురిసినముందస్తు సాగు అంచనాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచింది. జిల్లాలో పుష్కలంగా ఉన్న నీటి వనరులు, నిండుకుండల్లా మారిన చెరువుల పరిధిలో 5,24,523 ఎకరాల ఆ యకట్టు కింద రైతులు వరి నాట్లు వేస్తూ.. విత్తనాలు విత్తుతూ సాగు పనుల్లో బిజీ బిజీ అయ్యారు.
– ఖమ్మం, ఆగస్టు 4
ఖమ్మం, ఆగస్టు 4 : నెల ఆలస్యంగా కురిసిన వర్షాలు రిజర్వాయర్లను నిండు కుండలను చేశాయి. జిల్లాలో అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావడంతో పంటలు పుష్కలంగా పండనున్నాయి. వానకాలంతోపాటు యాసంగి పంటలకు సైతం ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువుల్లోకి నీరు సమృద్ధిగా చేరింది. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతో సాగు నీటికి ఢోకా లేని పరిస్థితి నెలకొంది. రైతుబంధు సాయం అందడం.. ఎరువుల నిల్వలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరడంతో రైతులు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం ఆయకట్టు 6,63,313 ఎకరాలు ఉండగా.. ఇందులో ఎన్నెస్పీ ఆయకట్టు 2,54,270 ఎకరాలు, సీతారామ ప్రాజెక్టు కింద 1,38,790 ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజీ-1 కింద 5,478 ఎకరాలు, ఎస్సారెస్పీ స్టేజీ-2 కింద 76,063 ఎకరాలు, వైరా మీడియం ప్రాజెక్టు కింద 17,390 ఎకరాలు, లంకాసాగర్ ప్రాజెక్టు కింద 7,350 ఎకరాలు, 1,409 చెరువుల కింద 1,17,063 ఎకరాలు, 135 లిఫ్ట్ ఇరిగేషన్ కింద 46,909 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో సీతారామ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు తప్ప మిగిలిన 5,24,523 ఎకరాలు సస్యశ్యామలంగా కానుంది. దీంతో వివిధ జలాశయాల కింద ఉన్న ఆయకట్టు, సాగర్ ఆయకట్టు రైతుల అనందానికి అవధులు లేకుండాపోయాయి. ఖరీఫ్‌లోనే కాకుండా వచ్చే యాసంగికి కూడా నీటి ఇబ్బందులు ఉండవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూగర్భ జలాలు కూడా పెరుగనుండడంతో బోర్ల కింద కూడా పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిండుకుండల్లా చెరువులు
జిల్లాలో చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మొత్తం 70 శాతం చెరువులు అలుగు పోస్తున్నాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనుల వల్ల చెరువుల ఆయకట్టు మొత్తం స్థిరీకరించారు. భారీ వర్షాలు కురిసినా కట్టలు, తూములు, అలుగులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సింగరేణి మండలం కారేపల్లి గ్రామంలోని సంగం కుంట చెరువు అలుగు మొత్తం దెబ్బతిన్నది. చింతకాని మండలం నేరడ చెరువు కట్ట దెబ్బతిన్నది. వీటితోపాటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ 88.231 వద్ద 21వ ఎంబీసీ లెఫ్ట్ సైడ్ వింగ్, రిటర్నింగ్ వాల్ దెబ్బతిన్నది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక చోట్ల రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు దెబ్బతినడంతో సుమారు రూ.కోటి మేర నష్టం వాటిల్లినట్లు జిల్లా ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.
ముంపులో నిర్మాణాల వల్లే నష్టాలు
వాగులు, నదులు, చెరువులకు నీటిపారుదల శాఖ అధికారులు ఎఫ్టీఎల్ను నిర్ణయిస్తారు. దాని పరిధి లోపల ఇంటి నిర్మాణాలు గానీ, ఇతరత్రా నిర్మాణాలు చేయాలన్నా నీటిపారుదల శాఖ అధికారుల అనుమతి అవసరం ఉంటుంది. ఆ శాఖ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తారు. చెరువుల ఆయకట్టు గానీ.. ఇతరత్రా నీటి వనరులున్న ఏ ప్రాజెక్టుకైనా ఈ నిబంధన వర్తిస్తుంది. కానీ.. కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండడంతో బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకోవడం వల్ల ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని గుర్తించి ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఇంజినీరింగ్ అధికారులు సూచిస్తున్నారు.
మొత్తం ఆయకట్టు సస్యశ్యామలం
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతుల పంట భూములకు సరిపడా నీళ్లు అందించే అవకాశం ఉంది. అనేక చెరువులు అలుగు పోస్తుండడంతో రైతులు, మత్స్యకారులు ఆనంద పడుతున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఢోకా లేదు. సాగర్ ఆయకట్టు రైతులు ఇబ్బంది లేకుండా పంటలు సాగు చేసుకోవచ్చు. యాసంగి పంటలకు కూడా ఇబ్బంది ఉండకపోవచ్చు.
– శంకర్‌నాయక్, సీఈ, నీటిపారుదల శాఖ, ఖమ్మం