బోనకల్లు, ఆగస్టు 29 : వరదల వల్ల పదేపదే నష్టపోతున్న మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని బోనకల్లు మండలం కలకోట పెద్ద చెరువు హరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం కలకోట పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కలకోట గ్రామంలో 40 సంవత్సరాలుగా హరిజన మత్స్య పారిశ్రామిక సాహకార సంఘం కొనసాగుతుందన్నారు. ఆనాటి ప్రభుత్వం 203 మాదిగ, మాల కుటుంబాలను మత్స్యకారులుగా గుర్తించి సొసైటీ ఏర్పాటు చేయగా చేపల వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఏడాది పలు కారణాల వల్ల చెరువులో చేపలు పట్టుకోలేకపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చి వంద టన్నుల చేపలు, వలలు, జాలీలు, పడవలు ప్రవాహానికి కొట్టుకుపోవడం జరిగిందన్నారు.
ఈ పరిస్థితుల్లో 203 కుటుంబాలకు నష్టం జరిగిందన్నారు. రెండేండ్లుగా చేపల పెంపకానికి పెట్టుబడి పెట్టడం, వరదల వల్ల చేపలు కొట్టుకపోవడంతో చేసిన అప్పులు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బలుగురి అచ్చయ్య, సెక్రెటరీ యంగల రవి కుమార్, ఉపాధ్యక్షుడు తోటపల్లి జాషువా, డైరెక్టర్స్ ప్రభాకర్, సుందర్రావు, దావీదు బాబు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.