మొన్న ఎకరం.. నిన్న ఎకరం.. రేపు మరో ఎకరం.. ఎల్లుండి ఇంకో ఎకరం.. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రైతుభరోసా’ పథకం తీరు. రైతులకు వ్యవసాయ సీజన్ ప్రారంభంలో ఒకేసారి పెట్టుబడి సాయం అందించాల్సిన కాంగ్రెస్ సర్కార్ వాయిదాల పద్ధతిలో చెల్లించడం మొదలుపెట్టింది. ఈ యాసంగి సీజన్లో ఇప్పటివరకు కేవలం రెండు విడతల్లో రెండు ఎకరాలకు మాత్రమే డబ్బులను రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేసింది. అయితే ప్రస్తుత యాసంగి సీజన్ పూర్తయ్యింది కానీ.. ఇంకా వాయిదాలు మిగిలిపోయాయి. దీంతో మిగతా డబ్బులు దేవుడెరుగు.. అసలు ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పరిపాలన చేతగాని రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-అశ్వారావుపేట, ఏప్రిల్ 28
రైతులకు పంట పెట్టుబడి సాయం అందించి ఆర్థిక తోడ్పాటునందించాలనే గొప్ప లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టింది. ప్రతి ఏటా రెండు వ్యవసాయ సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10 వేలు ఆర్థిక భరోసా ఇచ్చింది. అయితే ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక రూ.12 వేలు మాత్రమే ఇవ్వగలమంటూ మాట మార్చింది. ‘రైతుబంధు’ పేరును ‘రైతుభరోసా’గా మార్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ పథకం అమలును అభాసుపాలు చేస్తున్నది. పలు దఫాలుగా అన్నదాతకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం ప్రస్తుత యాసంగి సీజన్‌కు మొక్కుబడిగా అమలు చేస్తున్నది. రైతు వ్యతిరేకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెల 22న మొదటి విడత కింద ఎకరంలోపు రైతులకు నిధులు జమ చేసింది. తర్వాత మరో 20 రోజుల్లో రెండోవిడత మంజూరు చేస్తామంటూ ప్రకటించినా విస్మరించింది. ఇంతలో కేసీఆర్ జగిత్యాల సభతో బెంబేలెత్తిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 20వ తేదీన గత్యంతరం లేక రెండో విడత నిధులు విడుదల చేశారు. మరో రెండు నెలల్లో వానకాలం వ్యవసాయ సీజన్ మొదలు కానుండటంతో రేవంత్‌రెడ్డి వాయిదాల పద్ధతిలో పెట్టుబడి సాయం చెల్లింపుపై రైతులు పెదవి విరుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 5.61 లక్షల ఎకరాలకు రూ.337.11 కోట్లు పెట్టుబడి సాయం అందించాల్సిన ప్రభుత్వం మొదటి విడతలో 1,76,460 మంది రైతులకు రూ.98.33 కోట్లు, రెండో విడతలో 1,80,008 మంది రైతులకు 72.76 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.166.06. కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇవి ఎప్పటికి రైతులకు అందుతాయో అంతుబట్టని ప్రశ్న. రానున్న వానకాలం సీజన్ వరకు కొనసాగితే.. మరి ఆ సీజన్ రైతుభరోసా అమలు ఎలా చేస్తారు అన్నది కూడా ప్రభుత్వానికే ఎరుక.
రఘునాథపాలెం, ఏప్రిల్ 28: ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కోవడం రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లుగా అలవాటుగా మార్చుకున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమైన నాటి నుంచి రైతులు పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చే ‘రైతుభరోసా’ కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. అయితే పంట కోతలు మొదలై కొనుగోళ్లు ప్రారంభించాక ఒక్క ఎకరానికి రైతుభరోసా డబ్బులు జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్లీ రెండో విడతగా మరో ఎకరానికి 15 రోజుల తరువాత ఇస్తామని ప్రకటించి మాట తప్పాడు ముఖ్యమంత్రి. కచ్చితంగా 27 రోజుల తర్వాత మళ్లీ ఒక్క ఎకరానికే రైతుభరోసా నిధులు జమ చేశారు. కానీ, రెండోవిడతగా 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుభరోసా నిధులు వేస్తున్నట్లు ప్రకటించి కంప్యూటర్లో బటన్ నొక్కాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా సంబురపడ్డారు. తమకు రూ.30 వేలు వస్తాయనుకొని ఐదెకరాల్లోపు రైతులంతా ఆశతో ఎదురుచూశారు. తీరా ఖాతాలను చెక్ చేసుకోగా మళ్లీ ఒక్క ఎకరానికి మాత్రమే డబ్బులు పడ్డాయని తెలుసుకొని నిర్ఘాంతపోయారు.. చేసేదిలేక సీఎం రేవంత్‌రెడ్డిపై రైతులు తిట్ల దండకాన్ని మొదలుపెట్టడం గమనార్హం.
రైతుభరోసా నిధులు ప్రభుత్వమే నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లాలో 5.61 లక్షల ఎకరాలకు రూ.337.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రెండు వాయిదాల్లో రూ.171.09 కోట్లు రైతులకు జమ చేసింది. ఇంకా రూ.166.02 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిధులు విడుదల కాగానే జమ అవుతాయి.
– బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీతో ఓట్లు వేసి గెలిపించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా పథకం అమలు తీరు చూశాక మోసపోయామని గ్రహించాం. అసలు పెట్టుబడి సాయం విడతలవారీగా ఇవ్వటమేమిటి. ఆ సొమ్ము రైతుకు ఎలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అసమర్ధతకు రైతుభరోసా పథకం అమలు ఒక మచ్చు తునక.
– యర్రంశెట్టి రమేశ్, రైతు, అశ్వారావుపేట
గత కేసీఆర్ ప్రభుత్వం ఒకే దఫాలో రైతులందరికీ పెట్టుబడి సాయం అందించింది. ఈ సొమ్ము వ్యవసాయ పనులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాగా పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. రుణమాఫీ హామీ కూడా నెరవేర్చలేదు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది.
– ఆంగోతు లక్పతి, రైతు, టేకులపల్లి
ఎన్నికల ప్రచారంలో పెట్టుబడి సాయం రూ.15 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక రూ.12 వేలకు తగ్గించి రేవంత్ సర్కార్ మాట తప్పింది. ఇప్పటికే పలు దఫాలుగా పెట్టుబడి సాయం ఎగ్గొట్టి ఇప్పుడు ఎకరా చొప్పున వాయిదా పద్ధతిలో చెల్లించడం సరికాదు. అసలు పథకం కొనసాగుతుందా.. అనే సందేహం కలుగుతోంది.
– బట్ట వెంకటేశ్వర్లు, రైతు, కమలాపురం, మణుగూరు
వ్యవసాయ పనులకు ఆర్థిక దన్నుగా ఉన్న పెట్టుబడి సాయాన్ని సకాలంలో ఒకేసారి అందించాలి. ఎకరా చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లించడం వల్ల ఉపయోగం ఉండదు. యాసంగి పంటకు వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టాను. కాంగ్రెస్ ప్రభుత్వం అందించే రైతుభరోసా నిధులు వడ్డీలకు కూడా సరిపోయేలా లేవు.
– మునిగల భానుప్రకాశ్, రైతు, మణుగూరు