మామిళ్లగూడెం, ఏప్రిల్19 : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డీపీఆర్సీ భవనంలో నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఖమ్మం రూరల్లో పలుచోట్ల వేగనియంత్రణ కోసం రేడియం స్టికర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నియంత్రిస్తున్నట్లు చెప్పారు. కల్లూరు, కొణిజర్ల, వైరా ప్రాంతాల్లో వేగనియంత్రికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసుశాఖ సన్నాహాలు చేస్తున్నదన్నారు. ఖమ్మం కమిషనరేట్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రచారం చేయాలన్నారు.
ప్రతి గ్రామంలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా యజమానులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా సరిహద్దుల నుంచి వచ్చే గంజాయి, గుటాను కట్టడి చేసేందుకు నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోక్సోయాక్ట్, క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, గ్రేవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో ప్రతిభచూపిన 150 మంది పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ గౌస్అలమ్, అడిషనల్ డీసీపీ లా ఎండ్ ఆర్డర్ సుభాశ్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు సాధన రష్మీపెరుమాళ్లు, ఆంజనేయులు, రామోజీ రమేశ్, వెంకటేశ్, బస్వారెడ్డి, ప్రసన్నకుమార్, రామానుజం, విజయబాబు, ట్రైనీ ఐపీఎస్ సంకీత్ పాల్గొన్నారు.