ఇల్లెందు రూరల్, డిసెంబర్ 31: మండలంలోని సుదిమల్ల గురుకుల కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడాపోటీలు ఆదివారం ఉత్సహంగా ముగిశాయి. నాలుగు జోన్ల నుంచి 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-19 వాలీబాల్‌లో జోన్-3 ఇన్నర్ టీం వర్సెస్ సెలక్షన్ టీం తలపడ్డాయి. ఇన్నర్ టీం మొదటి బహుమతి సాధించింది. కబడ్డీలో జోన్-3 ఇన్నర్ టీం మొదటి బహుమతి, సెలక్షన్ టీం రెండో బహుమతి సాధించాయి. అండర్-17 వాలీబాల్‌లో జోన్-2పై జోన్-3 సుదిమల్ల పాఠశాల విద్యార్థినులు ఘన విజయం సాధించారు. అండర్-14 అథ్లెటిక్స్ విభాగంలో ఇండివిజువల్ చాంపియన్‌షిప్‌ను అన్నపరెడ్డిపల్లి విద్యార్థిని జి.సాత్విక గెలుచుకుంది.
అండర్-17 అథ్లెటిక్స్ విభాగంలో ఇండివిజువల్ ఛాంపియన్‌షిప్‌ను ఇ.హిందూ భద్రాచలం విద్యార్థిని గెలుచుకుంది. అండర్-19 అథ్లెటిక్స్ ఇండివిజువల్ విభాగంలో టి.శ్రీతేజ విజేతగా నిలిచింది. మెగా ఛాంపియన్‌షిప్‌గా జోన్ -3 ఘన విజయం సాధించింది. విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ టి.వెంకటేశ్వరరాజు, ప్రిన్సిపాల్ అరుణకుమారి, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ జి.మాధవి, బాలికల జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ షాజహన్ తదితరలు పాల్గొన్నారు.