భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) ; గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. ఓటర్ల తుది జాబితాకు ఫైనల్ కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం విదితమే. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని మండల, పంచాయతీ కార్యాలయాల్లో పంచాయతీ అధికారులు ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించారు. రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు ఉంటే స్వీకరించి మార్పులు, చేర్పులతో సెప్టెంబర్ 2వ తేదీన ఓటర్ల జాబితాను ఫైనల్ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ఓటర్లు 6,69,024 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 2వ తేదీన ఫైనల్ చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 28వ తేదీన జిల్లావ్యాప్తంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన అధికారులు 29న జిల్లాస్థాయిలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. 30వ తేదీ శనివారం మండలస్థాయిలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఎంపీడీవోలు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అభ్యంతరాలు ఉంటే స్వీకరించి 31వ తేదీన వాటిని ఫైనల్ చేస్తారు. ఆయా పంచాయతీల పరిధిలో బూత్‌లెవల్ ఆఫీసర్ల ద్వారా పూర్తి సమాచారాన్ని ఇప్పటికే తీసుకున్నారు. జిల్లాలో పల్లె ప్రాంతంలో ఓటర్ల జాబితాను తయారు చేయగా అందులో మొత్తం 6,69,024 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్కచూపారు. పురుషులు 3,25,033 మంది, మహిళలు 3,43,967 మంది, ఇతరులు 24మంది ఉన్నట్లు గుర్తించారు. మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.
471 గ్రామ పంచాయతీలు
జిల్లాలో గత ఎన్నికల్లో 481 పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం కొన్ని పంచాయతీలు మున్సిపాలిటీలో కలవడంతో పంచాయతీల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 471 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సుజాతనగర్లో 7 పంచాయతీలు, అశ్వారావుపేటలో 3 పంచాయతీలు మున్సిపాలిటీ, కార్పొరేషన్లో కలవడంతో జీపీల సంఖ్య తగ్గింది. మొత్తం 471 పంచాయతీలకుగాను 4,168 వార్డులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వీటి ఎన్నికల కోసం 4,242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వార్డుల్లో దూరంగా ఉన్న ఓటర్లను కూడా దగ్గరలో ఉండేలా సర్దుబాటు చేశారు. బ్యాలెట్ బాక్సులను కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం..
ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశాం. నేటి నుంచి మండలస్థాయిలో రాజకీయ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నాం. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలను స్వీకరించి మార్పులు, చేర్పులు చేస్తాం. వచ్చేనెల 2వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తాం.
– చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం