ఆరు నెలల క్రితం అస్పష్టమైన కారణాలపై జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యాసంస్కర్త సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ కఠినమైన చట్టం కింద అరెస్టు చేసిన వారిని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐచ్ఛికంగా విడుదల చేయడం అరుదైన విషయమే. లద్దాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తిస్తూ చట్టం చేయాలని, ఆ చట్టాన్ని రాజ్యాంగం ఆరో షెడ్యూల్లో చేర్చాలని వాంగ్‌చుక్ నేతృత్వంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో హింసాకాండ చెలరేగి పోలీసులు కాల్పులు జరిపేదాకా వెళ్లింది. దీనంతటికీ బాధ్యుణ్ని చేస్తూ వాంగ్చుక్ను కేంద్రం అరెస్టు చేసింది. ఆ ఆరోపణల్లో పసలేదనే వాదన మొదటి నుంచీ ఉన్నది.
జోధ్‌పూర్ జైలు నుంచి ఆయనను విడుదల చేయడం వెనుక గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్రం పెట్టిన కేసుల్లాగే ఇదీ కోర్టులో వీగిపోతుందనే భయం వల్ల విడుదల చేశారనేది అందులో ఒకటి. తన అరెస్టును సవాల్ చేస్తూ భీకర న్యాయపోరాటానికి వాంగ్‌చుక్ సంసిద్ధమైన దశలో కేంద్రం ఆయనను విడుదల చేయడం గమనార్హం. లద్దాఖ్ ప్రజల స్వరాష్ట్ర సాధన డిమాండ్‌పై కేంద్రం మెత్తబడి ఉండొచ్చని, ఆ డిమాండ్ అమలుకు ప్రాథమిక షరతుగా వాంగ్‌చుక్ విడుదల ఉందనేది మరొకటి. తన కేసులో గౌరవ న్యాయస్థానం తీర్పు వెలువడాలని కోరుకొంటున్నట్టు వాంగ్‌చుక్ చెప్పడం విశేషం. కోర్టు అభిప్రాయం వెల్లడైతే భవిష్యత్తులో ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడేదని ఆయన అభిప్రాయం. రాజకీయ ప్రత్యర్థులను ఏదో ఒక కేసులో అరెస్టు చేసి, తర్వాత తాపీగా ఆరోపణలపై ఆలోచించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిపాటి అయింది.
లద్దాఖ్ నేతలతో కేంద్రం త్వరలో చర్చలు జరుపుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లదఖ్పై కేంద్ర వైఖరి నిజంగానే మారిందా అనేది ప్రశ్న. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు, ఆరో షెడ్యూల్ డిమాండ్‌కు ఒప్పుకొంటుందా? రాష్ట్ర ప్రతిపత్తి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని వాంగ్‌చుక్ చాలాసార్లు స్పష్టంచేశారు. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకపోవడం సందేహాలకు తావిస్తున్నది. ఈ కారణంగానే తమను మోసం చేసేందుకే కేంద్రం వాంగ్చుక్ను విడుదల చేసి ఉండొచ్చని లద్దాఖ్ వాసులు అనుమానిస్తున్నారు. కేంద్ర ప్రభు త్వం 2019 ఆగస్టులో కశ్మీర్లో అమలవుతున్న 370 అధికరణాన్ని ఎత్తివేసి, రాష్ర్టాన్ని రెండుగా విభజించింది. జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లద్దాఖ్‌ను విడిగా మరో కొత్త కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. స్వతం త్ర పరిపాలనా విభాగంగా ఏర్పడినా లద్దాఖ్ ప్రజలు తమకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని, కుదరని పక్షంలో శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కోరుకొంటున్నారు. కేంద్రం మరింత తాత్సా రం చేయకుండా వాంగ్‌చుక్‌తో సహా అన్నివర్గాలతో చర్చలు జరిపి ప్రజాభీష్టం మేరకు పరిష్కారాన్ని కనుగొనడం తక్షణం అవసరం.