ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పార్లమెంట్లో గగ్గోలుపెట్టే రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం తెలంగాణ సహా అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ర్టాల్లో అదే రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు విషయంలో తలెత్తుతున్న సందేహాలు ఈ చర్చకు కేంద్రబిందువుగా మారాయి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అవతారం దాల్చింది. ఈ రెండున్నరేండ్లలో ‘ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోవడం కాంగ్రెస్కు కొత్త విషయం కాదు. కానీ హామీల పరిమాణం, వాటి గొప్పతనం, వాటి చుట్టూ నిర్మించిన అంచనాలు ఎంత పెద్దవో, అమల్లో వాటి విఫలం కూడా అంత ఘోరంగా ప్రజల ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, దాదాపు 420 పైచిలుకు హామీలు, ఇవన్నీ ఇప్పుడు ప్రజల దృష్టిలో పాలన కంటే పంగనామాలుగా మారిపోయాయని భావన బలపడుతున్నది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికీ భరోసా, ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం, ప్రతి మహిళకు ఆర్థిక భద్రత, ప్రతి రైతుకు ఆదరణ, ఇలా ప్రతి వర్గానికీ ఒక ఆశ చూపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరైపోతున్నాయి. మాటల్లో మధురం, చేతల్లో మంట, ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ పాలనా తీరు.
యువతకు ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఉత్తర ప్రగల్బాలు పలికిన నాయకులు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. రోజులు, వారాలు, నెలలు, ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు స్పష్టమైన దారి కనిపించడం లేదు. నిరుద్యోగభృతి గురించి చేసిన హామీ కూడా మాటలకే పరిమితమైంది. ఇది కేవలం ఒక వాగ్దాన వైఫల్యమే కావడమే కాదు, ఒక తరం ఆశలు కూలిపోవడమే అవుతుంది.
హాస్టళ్లలో సమస్యలు, ఆహార నాణ్యతలో లోపాలు, విద్యాసంస్థలో వసతుల లేమి కొనసాగుతున్నాయి. ఒకవైపు భిన్న వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, మరోవైపు ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరకపోవడం అసంతృప్తిని పెంచుతున్నది. వృద్ధులకు పింఛన్లు రూ.2,500కు పెంచుతామని చెప్పినా నేటికీ అమలు కాలేదు. కళ్యాణలక్ష్మి అమల్లో లోపాలతోపాటు మహిళలకు ఇస్తామన్న తులం బంగారం వంటి వాటి గురించి కాంగ్రెస్ పాలకులు నోరెత్తడం లేదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా గంభీరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యేటికేడు కోట్ల రూపాయల అప్పులు పెరుగుతున్నాయి, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు పెరుగుతున్నాయి. ఇచ్చిన కల్లబొల్లి హామీల అమలుకు అవసరమైన నిధులేవీ? ఖర్చులకు ప్రాధాన్యత ఏమిటి? ఈ ప్రశ్నలకు స్పష్టత లేకపోవడం ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నది. హైడ్రా పేరిట బుల్డోజర్లతో పేదల ఇండ్ల కూల్చివేతలు, భూ వివాదాలు, స్కాంల ఆరోపణలు, ఇవన్నీ క్రమంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.
రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నది. రైతులు పండించే ఉత్పత్తులకు సరైన మద్దతు లేకపోవడం, వ్యవసాయ ఖర్చులు పెరుగడం, ప్రకటించిన పథకాల అమల్లో లోపాలు ఇవన్నీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రైతు సంక్షేమం గురించి కాంగ్రెస్ పాలకులు ఎంతో గొప్పగా చెప్పిన కబుర్లు అమల్లో ఇసుమంతైనా కానరావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. హామీలు ఎగ్గొట్టడం, గతంలో ఉన్న నిర్మాణాలను కూలగొట్టడం, బీఆర్ఎస్ హయాంలో అమల్లో ఉన్న పథకాలను చెడగొట్టడం, ఇదే పాలనగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటరు మౌనం ఒక హెచ్చరిక. దీనిని అర్థం చేసుకోకపోతే అది తీర్పుగా మారుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అదే పరిస్థితి కనిపిస్తున్నది.
– నాగరాజు మన్నారం 9550844433