గల్ఫ్‌లో పేలుతున్న బాంబులు మదుపరులను వణికిస్తున్నాయి. పొరుగు దేశాల్లోని రిఫైనరీ కాంప్లెక్స్‌లే లక్ష్యంగా దూసుకెళ్లిన ఇరాన్ క్షిపణులు.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటల్ని రాజేశాయి. భారతీయ ఇంధన అవసరాలకు దిగుమతులే దిక్కైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ క్రమం లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి.. దేశీయ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చింది.
ముంబై, మార్చి 19: పశ్చిమాసియా సంక్షోభం సెగ.. భారతీయ స్టాక్ మార్కెట్లకు గట్టిగానే తగులుతున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ముడి చమురు ఉత్పత్తి, రవాణా తీవ్రంగా ప్రభావితమవుతున్న విషయం తెలిసిందే. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌కు అండగా ఉంటున్నాయన్న కారణంతో పొరుగు దేశాలపై ఇరాన్ మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ తమ ప్రధాన సహజ వాయువు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినందుకు ప్రతీకారంగా ఖతార్‌లోని కీలకమైన సహజ వాయువు ఉత్పాదక కేంద్రం, కువైట్‌లోని రెండు ఆయిల్ రిఫైనరీలపై దాడి చేసింది. ఈ పరిణామం గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్ని పరుగులు పెట్టించగా.. గురువారం భారతీయ ఈక్విటీ మార్కెట్లను కుప్పకూల్చింది. ఈ దెబ్బకు దాదాపు ఏడాది కనిష్ఠానికి సూచీలు దిగజారాయి.
ఉదయం ఆరంభంలోనే భారీ నష్టాలను చవిచూసిన సూచీలు.. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా ఆ నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,496.89 పాయింట్లు లేదా 3.26 శాతం పడిపోయి 74,207.24 వద్ద ముగిసింది. 2024 జూన్ తర్వాత సెన్సెక్స్ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. అంతేగాక 2025 ఏప్రిల్ 7 నుంచి గమనిస్తే.. సెన్సెక్స్ ఈ స్థాయికి దిగజారడం ఇదే ప్రథమం. ఇక ఇంట్రా-డేలోనైతే 2,753.18 పాయింట్లు లేదా 3.58 శాతం కోల్పోయి 74 వేల మార్కుకు దిగువన 73,950.95 వద్దకు చేరింది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం పతనమై 23,002.15 వద్ద స్థిరపడింది. దీంతో గత మూడు రోజులుగా సెన్సెక్స్ (2,140 పాయింట్లు), నిఫ్టీ (626 పాయింట్లు)లు పొందిన లాభాలు ఆవిరైపోయినైట్టెంది. ఇక సెన్సెక్స్ షేర్లలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆటో, రియల్టీ, ఆర్థిక సేవలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ తదితర రంగాల షేర్లు కుదేలయ్యాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు నష్టపోయాయి. అమెరికా, ఐరోపా మార్కెట్లూ నీరసంగానే నడుస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భగ్గుమనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు 114.8 డాలర్లు పలికింది. చమురు శుద్ధితోపాటు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర రిటైల్ ఇంధన ఉత్పత్తుల అమ్మకాల్లో లాభాలు తగ్గుతాయన్న ఆందోళనలే కారణం. కాగా, బీఎస్ఈలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌పీసీఎల్ షేర్ విలువ 7.01 శాతం తగ్గి రూ.324.80 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 7.87 శాతం క్షీణించి 52 వారాల కనిష్ఠాన్ని తాకుతూ రూ.321.80 వద్దకు వెళ్లింది. అలాగే ఇతర సర్కారీ కంపెనీలైన బీపీసీఎల్ షేర్ విలువ 5.83 శాతం పడిపోయి రూ.286 వద్దకు, ఐవోసీఎల్ షేర్ విలువ 3.91 శాతం పతనమై రూ.142.70 వద్దకు దిగజారాయి.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో రెండో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీ నష్టాలకు గురయ్యాయి. అటు బీఎస్ఈలో, ఇటు ఎన్ఎస్ఈలో షేర్ల విలువ ఒకానొక దశలో ఏకంగా 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. బ్యాంక్ చైర్మన్ పదవికి అతను చక్రవర్తి అనూహ్యంగా రాజీనామా చేయడంతో మదుపరులు ఒక్కసారిగా అమ్మకాలకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌లో 5.13 శాతం క్షీణించి ఒక్కో షేర్ విలువ రూ.799.70 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 8.41 శాతం పతనమై రూ.772 వద్దకు దిగజారడం గమనార్హం. నిఫ్టీలోనూ 5.31 శాతం పడిపోయి రూ.798.20 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 8.66 శాతం కోల్పోయి రూ.770ని చేరింది. కాగా, ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్ విలువ రూ.65,946.08 కోట్లు ఆవిరై రూ.12,30,896.85 కోట్లకు పరిమితమైంది.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల నడుమ లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద కరిగిపోయింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.12.87 లక్షల కోట్లు హరించుకుపోయింది. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 3.26 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 3.34 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.77 శాతం క్షీణించాయి. దీంతో ఆయా కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12, 87,273.89 కోట్లు ఆవిరై రూ.4,26, 13,557.95 కోట్ల (4.61 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.
