ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 16 : పల్లెపోరు తుది దశకు చేరింది. మూడో దశలో ఉన్న ఆఖరి ఘట్టానికి బుధవారంతో తెరపడనుంది. దీంతో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ పరిపూర్ణం కానుంది. ఉదయం ఏడింటికి మొదలయ్యే పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వెనువెంటనే ఫలితాలు కూడా వెలువడనున్నాయి. చివరి విడత ఎన్నికలు కూడా పూర్తయితే ఈ నెల 20న నూతన సర్పంచ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. కాగా, ఈ చివరి విడతలో భద్రాద్రి జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 145 పంచాయతీలకు, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 168 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, అదే మండలంలోని పెద్దతండా పోలింగ్ కేంద్రాన్ని ఖమ్మం సీపీ సునీల్‌దత్ పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ బుధవారంతో ముగియనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. భద్రాద్రి జిల్లాలోని పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, డీఎస్పీ రెహమాన్, ఆర్డీవో మధు సందర్శించారు. సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే తీరును పరిశీలించారు. భద్రాద్రి జిల్లాలోని జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కలిపి మొత్తం 155 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 10 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు 1,258 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బంది కూడా తమ పోలింగ్ సామగ్రితో పంపిణీ కేంద్రాల నుంచి మంగళవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
‘భద్రాద్రి’లో 145 జీపీలకు..
మూడో విడతలో పది ఏకగ్రీవాలు పోగా.. మిగిలిన 145 పంచాయతీలకు బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 145 స్థానాల్లో 253 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, 1,330 వార్డులకుగాను 256 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,071 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిల్లో 2,802 మంది బరిలో ఉన్నారు. ఈ 145 పంచాయతీల్లో మొత్తం 1,75,074 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో ఉన్న 168 జీపీలకు మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నిజానికి ఈ విడతలో కారేపల్లి, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని 191 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో 22 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇదే మండలాల్లో 1,742 వార్డులకుగాను 361 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 పంచాయతీలకు 485 మంది, 1,381 వార్డులకు 3,369 మంది పోటీలో ఉన్నారు. అయితే, ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయతీలో నామినేషన్ దాఖలు కాలేదు, ఆ పంచాయతీ ఎస్టీలకు రిజర్వు కావడం, అక్కడ ఎస్టీలు అభ్యర్థులు లేకపోవడం వంటి కారణాలతో అక్కడ సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. కానీ వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా ఈ మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిల్లో ఏన్కూరు, నాచారం, జన్నారం, ఆరెకాయలపాడు గ్రామాలకు చెందిన కొందరు తమ పంచాయతీలను ఎస్టీ రిజర్వేషన్‌ను నుంచి తొలగించాలని కోర్టును ఆశ్రయించడంతో ఆ గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగడం లేదు. మొత్తం 168 జీపీల్లో 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
స్వేచ్ఛగా ఓటేయండి..
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెం ప్రగతి మైదాన్, డిసెంబర్ 16: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు లాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్రోజు కోరారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. మూడో విడతలో 1,288 పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ శాఖ తరఫున పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇందులో 619 సాధారణ పోలింగ్ కేంద్రాలు, 134 సమస్యాత్మక కేంద్రాలు, 168 అతి సమస్యాత్మక కేంద్రాలు, 184 క్రిటికల్ కేంద్రాలు, 183 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు రానీయొద్దు
కారేపల్లి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలనలో ఖమ్మం కలెక్టర్
కారేపల్లి, డిసెంబర్ 16: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లుచేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడో విడత ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందితో చర్చించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
‘నియమావళి’ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల పరిశీలనలో ఖమ్మం సీపీ దత్
కారేపల్లి, డిసెంబర్ 16: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం సీపీ సునీల్‌దత్ హెచ్చరించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను మంగళవారం ఆయన సందర్శించారు. కారేపల్లి పోలింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒకరూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బందికి అభ్యర్థులు, ప్రజలకు రాజకీయ నాయకులు సహకారం అందించాలని సూచించారు. సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.